Dubbaka : దుబ్బాకలో రివర్స్... ఆపరేషన్ ఆకర్ష్...,బీజేపీలో చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు...!

Dubbaka : దుబ్బాకలో రివర్స్... ఆపరేషన్ ఆకర్ష్...,బీజేపీలో చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు...!

Dubbaka : దుబ్బాక మున్సిపాలిటిలో టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది..ఇన్నాళ్లు ఆపార్టీకి మద్దతు పలికిన కౌన్సిలర్లు ముగ్గురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల పవనాలు ఉన్న దుబ్బాకలో మాత్రం కౌన్సిలర్స్ షాక్ ఇచ్చారు.

  • Share this:
    రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఇతర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేకమంది ఇతర పార్టీల్లో లేదా ఇండిపెండెంట్‌గా గెలిచిన ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓ వైపు పార్టీని బలోపేతం చేస్తూనే ప్రజా ప్రతినిధులను తమవైపుకు తిప్పుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్’ను టీఆర్ఎస్ నిరంతరం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇటివల హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణతోపాటు పలువురు నేతలు పార్టీలో చేరారు.

    అయితే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ట్రెండ్ నడుస్తుంటే..దుబ్బాకలో మాత్రం ఆ పార్టీకి చుక్కెదురైంది. అధికార పార్టీని కాదని స్థానిక కౌన్సిలర్‌లు బీజేపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రోద్బలంతో ముగ్గురు కౌన్సిలర్‌లు బీజేపీలో అధికారికంగా చేరిపోయారు. దీంతో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కాస్తా...వికర్ష్ ‌గా మారింది.

    వివరాల్లోకి వెళితే..గత ఎన్నికల్లో దుబ్బాక మున్సిపాటీలోని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి(3వ వార్డు), కనకయ్య(7వ వార్డు), దుబ్బాక బాలకిషన్‌(8వ వార్డు) ఎన్నికల అనంతరం అప్పటి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రోద్బలంతో టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఇటివల వారికి తగిన ప్రాధాన్యత లభించలేదని కౌన్సిలర్‌ మట్ట మల్లారెడ్డి ప్రకటించారు, గత ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కౌన్సిలర్‌లు వాపోయారు.. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. .మరోవైపు నెలరోజుల క్రితం ఒక మహిళపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో కౌన్సిలర్‌ మట్ట మల్లారెడ్డిపై కేసు కూడా నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు సున్నితంగా హెచ్చరించారు. ఈ పరిణామాలతో తమను టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఇబ్బందులకు గురిచేస్తుందనే నిర్ణయానికి వచ్చిన కౌన్సిలర్స్ బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

    ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బీజేపీ నాయకులు విజయశాంతి, డీకే అరుణ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.ఎమ్మెల్యే రఘునందన్ నేతృత్వంలో దుబ్బాక లో అభివృద్ధి కోసం కృషి చేస్తామని పార్టీ మారిన కౌన్సిలర్లు అన్నారు. దుబ్బాకనే కాదు తెలంగాణ సమాజం మొత్తం బీజేపీ వైపు చూస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సంధర్బంగా పేర్కొన్నారు.
    Published by:yveerash yveerash
    First published: