తెలంగాణలో డ్రగ్స్ (Drugs in Telangana) వ్యవహారం ఆందోళనకర స్థాయిలో వుందని సీఎం కేసీఆర్‌కు (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) బహిరంగ లేఖ (Open Letter)రాశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై జాతీయస్థాయిలో సిట్ (sit) ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎంగా కేసీఆరే ఆయా సంస్థలకు లేఖ రాయాలని రేవంత్ కోరారు. సిట్ ఏర్పాటు కోసం ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాయాలని కోరారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌తో యువకుడి మృతితోనైనా కేసీఆర్‌లో మార్పు రావాలని ఆకాంక్షించారు.
తక్షణమే డ్రగ్స్ (Drugs in Telangana)కు సంబంధించి డిజిటల్ రికార్డులను ఈడీకి అందజేయాలని కోరారు. మీ కుటుంబ సభ్యులను కాపాడటానికి సమాజానికి నష్టం చేయకండని లేఖలో పేర్కొన్నారు. పిల్లలు చచ్చిపోతున్నా మీరు స్పందించకుంటే మీ మానసిక పరిస్ధితిపై అనుమానం కలిగే పరిస్థతి వస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరింత మంది పిల్లలు బలికాకముందే సీఎం కేసీఆర్ స్పందించాలని బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
తెర వెనుక ప్రభుత్వం చేస్తోన్న చేష్టలే..
డ్రగ్స్ (Drugs in Telangana) భూతం ఏదో రూపంలో పడగ విప్పినప్పుడల్లా అందులో ప్రమేయం ఉన్న రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు ఉన్నాయన్నారు రేవంత్. ఎన్ని టాస్క్ ఫోర్సులు వేసినా, ప్రత్యేక అధికారులతో పర్యవేక్షించినా డ్రగ్స్ మాఫియా అంతం కాకపోవడానికి తెర వెనుక ప్రభుత్వం చేస్తోన్న చేష్టలే కారణమని, డ్రగ్ దోషి ప్రభుత్వమే అని భావించాల్సి వస్తుందని లేఖలో తెలిపారు.
ఈడీ కోర్టు ధిక్కార పిటిషన్..
2017 లో డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ను అరెస్టు చేసినప్పుడు ప్రభుత్వం విచారణకు సహకరించడం లేదని ఈ మధ్య ఈడీ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసే వరకు జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అసలు దోషి మీ ప్రభుత్వమే అనిపిస్తోందని రేవంత్ ఆరోపించారు. కెల్విన్ అరెస్టు.. విచారణ తర్వాత ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ 11 మంది సినీ ప్రముఖులతో పాటు, మొత్తం 60 మందిని విచారించిందని, ఇంతలా ఉరుము ఉరిమి ఇంతేనా కురిసింది అన్నట్టు వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చి కేసును అటకెక్కించారని ఆయన తెలిపారు.
ఈడీ సంసిద్ధత వ్యక్తం చేసిందని..
కేసు అయితే మూసేశారు కానీ, రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియా ఊడల మర్రిలాగా విస్తరిస్తూనే ఉందని రేవంత్ చెప్పారు. ఈ విచారణ తాలూకు వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీలు, ఛార్జ్ షీట్లు, నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, సెల్ ఫోన్ లోని వివరాలు, ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి స్వాధీనం చేసుకున్న కాల్ రికార్డులు, డిజిటల్ రికార్డులు తమకు అప్పగిస్తే మరింత లోతుగా విచారణ జరుపుతామని ఈడీ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. వివరాలన్నీ ఈడీకి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎందుకు సహకరించడం లేదు?
కోర్టు ఉత్తర్వుల అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ కు ఈడీ ఆరు సార్లు లేఖలు రాసినా స్పందించలేదని, ఈడీకి సమాచారం ఇవ్వకపోగా, విచారణకు సహకరించే పరిస్థితి కనిపించలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు సహకరించడం లేదు.. ? ప్రభుత్వం పై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ఎవరిని కాపాడే ఉద్ధేశ్యంతో మీరు ఈడీకి సహకరించడం లేదని, ఆధారాలు ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతున్నారని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం అని హైకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత కూడా కేసులో తీవ్రత మీకు ఎందుకు అర్థం కాలేదని రేవంత్ చెప్పారు. బెంగళూరులో నమోదైన డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయని, వారిని ప్రభుత్వమే కాపాడినట్టు కథనాలు వస్తున్నాయని, అయినా ఎందుకు స్పందించడం లేదని రేవంత్ మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.