సీబీఎస్ టు జేబీఎస్... త్వరలోనే మెట్రో పరుగులు

హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్య మెట్రో రైలు ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది.

news18-telugu
Updated: November 26, 2019, 11:58 AM IST
సీబీఎస్ టు జేబీఎస్... త్వరలోనే మెట్రో పరుగులు
మెట్రో రైలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
త్వరలోనే సికింద్రాబాద్, హైదరాబాద్‌ మధ్య మెట్రో రైలు పరుగు పెట్టనుంది. మెట్రో-2 కారిడార్‌లో భాగంగా జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ వరకు సోమవారం ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి నేతృత్వంలో సాంకేతిక బృందం, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు మెట్రో రైలులో ప్రయాణం చేశారు. కారిడార్‌లో సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ రెండింటి మధ్య ఉన్న 11 కిలోమీటర్ల మార్గంలో 9 స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్‌-పరేడ్‌గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్‌ వరకు 16 నిమిషాల సమయం పట్టనున్నట్లు అధికారులు అంచనా వేశారు.

సాధారణంగా ఈ రూట్‌లో రోడ్డు మార్గంలో 45 నిమిషాల వరకు సమయం పడుతుందని ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. మరికొన్ని వారాల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించి.. ఆ తర్వాత ప్రయాణికుల రాకపోకలకు అనుమతినిస్తారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా సాంకేతిక సమర్థత, రైళ్ల నిర్వహణ, సమయపాలన, సిగ్నలింగ్‌ వ్యవస్థ పనితీరు, బ్రేక్‌ టెస్ట్, ట్రైన్‌ కంట్రోల్‌ సిస్టమ్, ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్, రైళ్ల రాకపోకల అనౌన్స్‌మెంట్‌ తదితర అంశాలను పరిశీలిస్తారు. కరీంనగర్, సిద్దిపేట, మెదక్, గజ్వేల్‌ తదితర ప్రాంతాల నుంచి జేబీఎస్‌కు వచ్చే ప్రయాణికులు మెట్రో మార్గంలో నేరుగా ఎంజీబీఎస్‌కు చేరుకోవచ్చు.

ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే రైల్వేస్టేషన్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా మెట్రో ఎంతో సౌకర్యంగా ఉండనుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ నుంచి సుల్తాన్‌బజార్‌ వరకు వాహనాల రాకపోకలతో ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. మెట్రో రాక వల్ల ప్రయాణికులకు ఈ మార్గంలో ఊరట లభించనుంది. నిజాం కాలం నుంచి అతిపెద్ద వ్యాపార, వాణిజ్య కేంద్రంగా కొనసాగుతున్న అబిడ్స్, కోఠీ, సుల్తాన్‌బజార్‌ ప్రాంతాలు మెట్రోరైలు రాకతో సరికొత్త కళను సంతరించుకోనున్నాయి.First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>