హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న పవన్ నిమ్కర్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. తమ కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు ప్రియాంక కారణమని తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు. ప్రియాంక మాటలు, వేధింపుల వల్లే పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రియాంక ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతూ భర్తను పట్టించుకునేది కాదని వారు తెలిపారు. ఈ మేరకు పవన్ ఆత్మహత్యకు ప్రియాంక కారణమని బాలనగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. భర్త ఆత్మహత్యకు సంబంధించి టిక్‌టాక్ స్టార్ ప్రియాంక తొలిసారి పెదవి విప్పారు. పవన్ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై తాజాగా ప్రియాంక స్పందించారు. తన భర్త ఆత్మహత్యకు సంబంధించి అత్తమామలపై అనుమానం ఉందని ప్రియాంక సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇక, ఇందుకు సంబంధించి ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడిన ప్రియాంక.. తన భర్త ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదని తెలిపింది. తనపై అత్తమామలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. వాళ్లు చెప్పిందే నిజమైతే.. పవన్ తనతో కలిసి టిక్‌టాక్ వీడియోలు ఎందుకు చేసేవాడని ప్రశ్నించింది. పిల్లలు పుట్టకపోవడం, టిక్‌టాక్ వీడియోలు చేయడం, సోషల్ మీడియా వాడటం కారణంగా పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది.
పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే పవన్ తనను కొట్టడం ప్రారంభించాడని ప్రియాంక ఆరోపించారు. తరచూ గొడవలు జరిగేవని.. ఈ క్రమంలోనే ఇటీవల పవన్ తనను పుట్టింట్లో వదిలి వెళ్లాడని చెప్పింది. పవన్ నన్ను కొట్టిన, తిట్టిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదని తెలిపింది. గత కొద్ది రోజులుగా అతని ప్రవర్తన వింతగా ఉందని వెల్లడించింది. ఆస్తికి సంబంధించి పవన్ ఇంట్లో గొడవలు జరిగేవని.. అతని ఆత్మహత్యకు అదే కారణం అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. తాను పవన్‌ను వేధించానని చెప్పడంలో నిజం లేదని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.