HOME » NEWS » telangana » HYDERABAD THREE YEAR OLD GIRL KIDNAPPED FROM MGBS RESCUED SK

MGBS kidnap case: తల్లి ఒడిని చేరిన చిన్నారి.. 20 గంటల్లోనే కిడ్నాపర్ల అరెస్ట్

పెళ్లై ఆరేళ్లవుతున్నా నిందితులకు పిల్లలు కలగలేదు. ఈ క్రమంలో పిల్లలపై ప్రేమతోనే అవంతికను కిడ్నాప్ చేసినట్లు నేరాన్ని అంగీకరించారు.

news18-telugu
Updated: November 16, 2020, 10:14 PM IST
MGBS kidnap case: తల్లి ఒడిని చేరిన చిన్నారి.. 20 గంటల్లోనే కిడ్నాపర్ల అరెస్ట్
తల్లి ఒడిని చేరిన చిన్నారి అవంతిక
  • Share this:
హైదరాబాద్ నడిబొడ్డున కిడ్నాపైన చిన్నారిని  పోలీసలు వెతికి పట్టుకున్నారు.  20 గంటల్లోనే కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పాపను తల్లి ఒడికి చేర్చారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి.. కిడ్నాప్ కేసును ఛేదించారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగాలపురం గ్రామానికి చెందిన సంగటి జయలక్ష్మి, సంగటి రామాంజనేయులు దంపతులు హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ఇంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల కూతురు అవంతిక ఉంది. నవంబరు 14న జయలక్ష్మి, ఆమె కూతురు అవంతిక, జయలక్ష్మి అక్కాబావ లక్ష్మీ-నాగార్జున, వారి ఇద్దరు పిల్లలు కలిసి ఎంజీబీఎస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి బళ్లారిలో ఉన్న లక్ష్మీ ఇంటికి వెళ్లానుకున్నారు.


ఎంజీబీఎస్‌లో రాత్రి 09.30 గంటల సమయంలో కర్నాటక ఆర్టీసీకి చెందిన బళ్లారి బస్సును ఎక్కి కూర్చున్నారు. కాసేపటి తర్వాత.. నాగార్జునకు ఇష్టం లేక బస్సు నుంచి దిగిపోయాడు. అతనితో పాటు అందరూ కిందకు దిగారు. నాగార్జునను ఒప్పించేందుకు.. అతడితో పాటు జయలక్ష్మి కూడా వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి అవంతిక కనిపించలేదు. ఆ రాత్రి చుట్టు పక్కల అంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. బస్సులోని ఇతర ప్రయాణికులను అడిగితే.. ఎరుపురంగు చీర ధరించిన మహిళ, బ్లూ కలర్ షర్ట్ ధరించిన వ్యక్తి పాపను ఎత్తుకుపోయారని చెప్పారు.

అనంతరం అవంతిక కుటుంబ సభ్యులు అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ మురళీధర్ ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. కిడ్నాపర్లు మహబూబ్ నగర్ వైపు వెళ్లినట్లు తేలింది. బాలికను కిడ్నాప్ చేసిన తర్వాత..నిందితులు కోఠిలో బస్టాప్‌కు వెళ్లి.. అక్కడి నుంచి డబీర్ పురా చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి.. మరుసటి రోజు ఉదయం మహబూబ్ నగర్ బస్సు ఎక్కి వెళ్లిపోయారు. 15న ఉదయం మహబూబ్ నగర్ బస్టాండ్‌లో దిగి.. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మహబూబ్‌నగర్ స్టేషన్‌లో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను హైదరాబాద్ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

సంతానం లేకే కిడ్నాప్:

మహబూబ్ నగర్ జిల్లా వీపనగండ్ల మండలం సంగినాయిపల్లి గ్రామానికి చెందిన సంగమోని శివుడు, సంగమోని పార్వతమ్మ దంపతులే అవంతికను కిడ్నాప్ చేశారు. వీరు జగిత్యాలలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నవంబరు 14న జగిత్యాల నుంచి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌కు వచ్చారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ వెళ్లాలని అనుకున్నారు. అప్పుడే అవంతిక కనిపించడంతో ఆమెను కిడ్నాప్ చేశారు. ఐతే వీరికి పెళ్లై ఆరేళ్లవుతున్నా పిల్లలు కలగలేదు. ఈ క్రమంలో పిల్లలపై ప్రేమతోనే అవంతికను కిడ్నాప్ చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. ఇక కిడ్నాపైన అవంతికను 20 గంటల్లోనే  తల్లి ఒడికి చేర్చిన పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తమ పాపను క్షేమంగా అప్పగించిన పోలీసుల రుణం తీర్చుకోలేమని జయలక్ష్మీ, రామాంజనేయులు దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: November 16, 2020, 6:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading