తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Telangana budget 2022) తొలిరోజున బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLA) హైకోర్టు (High court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేశారో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Telangana Assembly speaker) మౌనమునిలా ఉండిపోయారని ఆరోపించారు. తమను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.
తమను సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. అసెంబ్లీ స్పీకర్ నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను (BJP MLA’s) సస్పెండ్ చేశారంటూ న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ (BJP MLA suspensions) చేశారంటూ న్యాయవాది వాదనలు వినిపించారు.
దీనిపై ధర్మాసనం (Bench) స్పందిస్తూ ప్రొసీడింగ్ కాపీ (Proceedings copy) ఎక్కడని ప్రశ్నించింది. న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్స్, యూట్యూబ్‌లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషన్ వేశామంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. చట్టసభలో నిబంధనలు ఉల్లంఘించడంతో సస్పెండ్ చేశారని కోర్టుకు న్యాయవాది విన్నవించారు. అయితే.. స్పీకర్ (Speaker) ఎవరిని సస్పెండ్ చేయాలనేది చెప్పాలి.. కానీ అలా జరగలేదంటూ న్యాయవాది వివరించారు. ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదని.. సభా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినప్పుడు మాత్రమే సస్పెండ్ చేయాలి.. కానీ అలా జరగలేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ప్రసాద్ ధర్మాసనానికి వాదనలు వినిపించారు. ప్రొసీడింగ్స్ కాపీ ఇవ్వడానికి కుదరదని.. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అటర్న్ జనరల్ హైకోర్టును కోరారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం.. శాసన సభ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ప్రొసీడింగ్స్ కాపీపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అనంతరం ఈ విషయంపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
ఏం జరిగింది?
అసెంబ్లీలో మొదటి రోజు ఆర్థిక మంత్రి ప్రసంగం కొనసాగుతున్న క్రమంలో పది నిమిషాల తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు తమ స్థానాల వద్ద నిల్చుని మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి హరీశ్ రావు (Harish rao) ప్రసంగానికి అడ్డు తగులుతుండటంతో సీఎం కేసీఆర్ సూచన మేరకు హరీశ్‌రావు ప్రసంగం ఆపారు. అనంతరం మంత్రి తలసాని అసెంబ్లీ రూల్స్ 340, సబ్ రూల్ 2 ప్రకారం బీజేపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని టీఆర్‌ఎస్ సభ్యులు బల్లలు చరుస్తూ ఆమోదించడంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Highcourt, Telangana Assembly, Telangana bjp, Telangana Budget 2022, Telangana Politics