తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. వేడికి జనం అల్లాడుతున్నారు. ఉక్కపోతకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కిందే ఉంటున్నారు. మార్చి 27 నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణల్లో వేడిగాలులు వీస్తున్నాయి. తూర్పు తెలంగాణలో అక్కడక్కడా చినుకులు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు తెలంగాణలో ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల , పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం, సూర్యాపేట, నారాయణపేట, వనపర్తి, గద్వాలలో 39 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, రూరల్, అర్బన్ వరంగల్, మెదక్, సిద్దిపేట, జనగాం, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి, భువనగిరిలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీల వరకు పెరగనున్నాయి. హైదరాబాద్ , మేడ్చల్, రంగారెడ్డిలో 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాక వెల్లడించింది.
నేటి నుండి పెరగనున్న ఉష్ణోగ్రతలు
పొడి గాలి పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు, దక్షిణ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. తూర్పు తెలంగాణలో మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం వేడిగా ఉంటుంది.
పెరుగుతున్న వేడి నుంచి సురక్షితంగా ఎలా ఉండాలి
తగినంతగా హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు తాగాలి. ఐస్‌తో కూడిన తడి తువ్వాలను ఉపయోగించడం, చల్లటి నీటిలో పాదాలు ఉంచడం, షవరు స్నానాలు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవాలి. పగటిపూట ఇంట్లో కర్టెన్లు మూసివేయాలి. నేరుగా ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. చల్లని గాలి ఉన్నప్పుడు కిటికీలు తెరవాలి. రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో ఎండకు దూరంగా ఉండండి. బయటికు వెళ్లవలసి వస్తే, టోపీ, సన్‌స్క్రీన్ ధరించాలి. విహారయాత్రలను రద్దు చేసుకోవడం ఉత్తమం. మీరు ఖచ్చితంగా బయటకు వెళ్లవలసి వస్తే సాయంత్రం 5 గంటల తరవాత బయటకు వెళ్లాలి. కాటన్ దుస్తులు ధరించాలి. చల్లని పదార్థాలు తీసుకోవాలి.
ఇలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి
వేడికి ఎవరైనా ప్రభావితం అవుతారు. 65 ఏళ్లు పైబడిన వారు ఎండ వేడి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె జబ్బులు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, మానసిక అనారోగ్యం ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీలు , పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు, -అధిక బరువు ఉన్నవారు ఎండ సమయాల్లో బయటకు వెళ్లవద్దని డాక్టర్లు చెబుతున్నారు. వేసివిలో దాహం ఎక్కువగా వేస్తుంది. తగిన మోతాదులో నీరు తాగుతూ ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Summer, Telangana News