సంక్రాంతి (Sankranti) వచ్చిందంటే మొదట కోడి పందాలే గుర్తొస్తాయి. పందెంకోళ్లను పౌరుషానికి ప్రతిరూపంగా చెబుతుంటారు. కత్తికట్టి బరిలోకి దించితే తన యజమాని పరువు కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడే వీటి జాతి ప్రమాదంలో పడిందని తెలుసా.. ? తెలుగు రాష్ట్రాలకు చెందిన అసిల్ జాతి(Aseel) కోడిని ప్రపంచంలోనే మొదటి జాతి కోడిగా పరిగణిస్తారు. నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్స్ అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతమున్న అన్ని రకాల కోళ్లు అసీల్(Aseel) జాతిలో ఉన్నాయి. కానీ జన్యు మార్పుల కారణంగా ఇదిప్పుడు భారతదేశంలోనే అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటోంది. అయితే థాయ్‌లాండ్‌లో(Thailand) మాత్రం ఈ కోడి ప్రాచుర్యం పొందుతోంది. ఈ కోడి జాతి తెలుగు రాష్ట్రాలకు (Telugu Aseel) చెందినదైప్పటికీ.. ఇంటర్నెట్లో సెర్చ్(Internet Search) చేస్తే థాయ్ పందెం కోడి అయిన అసీల్ కోడి(Thailand fighter cock) రిజల్ట్ రావడం గమనార్హం. అంతగా ఇది థాయ్‌లాండ్‌తో పాటు, వియత్నాం, ఆస్ట్రేలియా, ఐరోపాల్లో ప్రసిద్ధి చెందింది.
ఇక్కడిదే.. కానీ..
ఆంధ్రప్రదేశ్ నుంచి అసీల్ జాతి జెర్మ్ప్లాజమ్ను(Aseel germplasm) సేకరించిన థాయ్‌లాండ్.. అచ్చం దానిలాగానే ఉండే పరుషమైన జాతి కోడి షమ్మో(షామో)ను అభివృద్ధి చేసింది. వీటి కోసం అక్కడ వందల కొద్దీ సంతానోత్పత్తి కేంద్రాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భారత్‌లోనే కాకతీయ, కుతుబ్ షాహీల కాలంలో ఈ జాతికి అసీల్ అనే పేరు వచ్చింది. దీనికి అరబిక్‌లో స్వచ్ఛమైన అని అర్థం.
అక్కడ ఇప్పటికే కనుమరుగు..
ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే తెలుగు రాష్ట్రాలు అసీల్ జాతి కోడి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పౌల్ట్రీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నుంచి పంజాబ్ మీదుగా అసీల్ను దిగుమతి చేసుకున్న పాకిస్థాన్ (Pakistan fighter hen) సైతం వీటి అభివృద్ధిలో వెనుకబడిపోయింది. ఇతర పక్షులతో క్రాస్ బ్రీడింగ్ కారణంగా ఇప్పటికే అక్కడ ఈ జాతి కోడి అంతరించిపోయింది. ప్రస్తుతం పాక్ కూడా పందెం కోళ్లు, పౌల్ట్రీ అవసరాల కోసం థాయ్ అసీల్ రకంపైనే ఆధారపడుతోంది.
థాయ్‌లాండ్‌లో అసీల్ నుంచి డెవలప్ అయిన షమ్మో రకమే కాకుండా.. ఐరోపాలోనూ అనేక జాతులు అసీల్ రకం నుంచే వచ్చినట్లు అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఆశ్చర్యకరంగా.. బ్రిటీష్ పౌల్ట్రీ(British Poultry Industry) నిర్వహించిన దిగుమతి పరీక్షలను, ఆ దేశ ప్రమాణాలను భారతీయ(తెలుగు) అసీల్ కోడి చేరుకోలేదు. కానీ థాయ్ అసీల్ మాత్రం ఆ దేశంలోకి దిగుమతి అవ్వాలంటే ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగిఉంది.
ఈ విధంగా భారత్ సొంత రకమైన అసీల్ జాతి కనుమరుగయ్యే పరిస్థితికి రావడం దురదృష్టకరమని సీనియర్ జన్యు శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎన్ ఖాజా విచారం వ్యక్తం చేశారు. "మాంసం కోసం కోళ్లను పెంచే మార్గాల్లో అవలంబిస్తున్న హైబ్రిడ్ చికెన్ రకాల వల్లే జన్యు కోత సంభవిస్తుంది" అని డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ బృందం చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది. జాతి లక్షణాల్లో రాజీ లేకుండా ఉత్పాదకతను మెరుగుపరచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cock fight, Hyderabad, Telangana