వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక వర్షాలు నమోదైన తెలంగాణలో ప్రస్తుత వాతావరణం విచిత్రంగా మారింది. వానలు తగ్గి ఎండ, ఉక్కపోత పెరిగాయి. కానీ, బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆదివారం హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.
హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో.. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిటీలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు 24డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయని చెప్పింది. ఆగ్నేయ దిశ ఉపరితల గాలులు గంటకు 6నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ లో గరిష్టంగా 32.2 డిగ్రీలు, కనిష్టంగా 24.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. కాగా,
హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ చెప్పింది. శనివారం మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు స్వల్పంగా కురిశాయి. తెలంగాణలో నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం 75.19 సెంటీమీటర్లు కాగా, ఈ ఏడాది 39 శాతం అధికంగా, అంటే, 104.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 1వ తేదీనుంచి రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమైంది. డిసెంబర్ 31వ తేదీవరకు ఉండే ఈ సీజన్‌లో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే క్రమంలో..
తెలంగాణలో వర్షాలు తగ్గి ఉక్కపోత క్రమంగా పెరుగుతున్నది. గడిచిన రెండు రోజులుగా వాతావరణంలో తేమ వల్ల ఉక్కపోత పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. గాలిలో తేమ సాధారణంకన్నా 13 శాతం అదనంగా ఉందని, దాని వల్ల ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 డిగ్రీలు అదనంగా పెరిగాయని ఆమె చెప్పారు. మొత్తంగా రాబోయే రెడు వారాలపాటు, అంటే, ఈ నెల 15వ తేదీ వరకూ వాతావరణం ఇదే తరహా ఉక్కపోతలు ఉంటాయన్నారు. మరోవైపు,
వాతావరణ శాఖకు విడిగా పనిచేస్తోన్న ప్రైవేటు నిపుణులైతే రాష్ట్రంలో ఉష్ణోగ్రత మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. రాబోయే రెండురోజులు, అంటే అక్టోబర్ 5 వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 38డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరగొచ్చని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IMD, Imd hyderabad, Telangana, WEATHER, Weather report