అనుకున్నట్టే జరిగింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ ఆధారంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశం కల్పించనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మెరుగయ్యాక పరీక్షలకు అవకాశమిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇందుక సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఉదయం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఇందుకు సంబంధించి చర్చించారు. అనంతరం ఈ అంశంపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నారు.
పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. మే 17న తెలుగు, మే 18న హిందీ, మే 19న ఇంగ్లీష్, మే 20న మ్యాథ్స్, మే 21న సైన్స్, మే 22న సోషల్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ పరీక్షలు రద్దు కానున్నాయి. మరోవైపు పదో తరగతి పరీక్షల రద్దు విషయంలో కేంద్రం దారిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. సీబీఎస్ఈకి సంబంధించి పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం.. 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్లో పరిస్థితులను బట్టి 12వ తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. తెలంగాణలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం.. ఇంటర్ పరీక్షలను వాయిదా వేసి తరువాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.