జర్నలిస్టుగా మొదలై సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ గా ఎదిగి, అధికార టీఆర్ఎస్ తో కయ్యంపెట్టుకుని జైలు పాలైన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తీన్మార్ మల్లన్నపై ఒకే తరహా అభియోగాలున్నా అనేక కేసులు నమోదు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. సదరు కేసులపై చట్టంలోని నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని, ఈ కేసుల దర్యాప్తును డీజీపీ వ్యక్తిగత స్థాయిలో పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది.
తీన్మార్ మల్లన్నపై ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒక కేసులో దర్యాప్తు చేపట్టాలని, మిగిలిన కేసులను స్టేట్‌మెంట్స్‌గా పరిగణించాలని, మిగిలిన కేసులను మూసేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. తన భర్త మల్లన్నపై ఒకే తరహా ఆరోపణలతో పలు పోలీస్ స్టేషన్లల్లో కేసులు పెట్టారని మల్లన్న భార్య మమత కోర్టును ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులపాటు చేసేందుకే పోలీసులు కేసుల సంఖ్యను పెంచారని, దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణ్ తాజాగా కీలక ఆదేశాలిచ్చారు..
తీన్మార్ మల్లన్నపై 35 కేసులు నమోదు కాగా, ఇందులో 22 కేసులు హైదరాబాద్ పరిధిలో, మరో 13 వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆయా కేసుల్లో పీటీ వారెంట్, వారెంట్ జారీ అయిన సమాచారాన్ని నవీన్‌కుమార్‌కు లేదా ఆయన భార్య మత్తమ్మకు వారంలో తెలియజేయాలని కోర్టు చెప్పింది. నవీన్‌కు మార్పై నమోదుచేసిన కేసుల్లో ఏడేళ్లకు మించి శిక్షపడే నేరాల్లేవని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అర్నేష్‌కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు నేర విచారణ చట్టం సెక్షన్ 41–ఎ కింద దర్యాప్తు అధికారులు నోటీసులు జారీచేయాలని హైకోర్టు ఆదేశిచింది.
ఈ సందర్భంగా జడ్జి లక్ష్మణ్ ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు.. మల్లన్నను అరెస్టు చేయాలనుకున్నా, పీటీ వారెంట్ కింద అరెస్టు చూపించాలనుకున్నా డీకే బసు కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన నిబంధనలను తెలంగాణ పోలీసులు పాటించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతీకారం తీర్చుకునే తరహాలో పోలీసులు వ్యవహరించరాదని, నవీన్‌కుమార్, ఆయన భార్యను వేధింపులకు గురిచేయరాదు. వీరిపై కేసుల నమోదుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తు చేపట్టేలా డీజీపీ రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ హెచ్వోలను ఆదేశించాలని కోర్టు పేర్కొంది.
మల్లన్నపై కేసుల్లో బెయిల్ కోసం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చినప్పుడు సెక్షన్ 41 ఏ అమలు చేసింది మేజిస్ట్రేట్లు గుర్తించాకే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. చాలా కాలంగా కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న మల్లన్నను గత నెలలో పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న మల్లన్న.. కేసుల నుంచి ఉపశమనం లభించేలా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. మల్లన్న జైలు జీవితం పొడగిస్తున్న కొద్దీ, బయటున్న ఆయన టీమ్ ముక్కలుగా విడిపోతున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DGP Mahendar Reddy, Teenmar mallanna, Telangana High Court