తెలంగాణ హెల్త్ డైరెక్టర్(Health Director) గడల శ్రీనివాసరావు(Gadala Srinivasa rao)పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన వ్యాఖ్యలు, వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న ఉన్నతస్థాయి అధికారి..మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ప్రజారోగ్య సంచాలకుడి హోదాలో ఉన్న శ్రీనివాసరావు..శాఖలోని అధికారులు, వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పుట్టిన రోజు సందర్భంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కుల పెంచాలని, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి చేయాలని డీఎంహెచ్‌వో(DMHO)లను ఆదేశించమే శ్రీనివాసరావుపై విమర్శలు రావడానికి కారణమయ్యాయి.
మరో కాంట్రవర్సీలో హెల్త్ డైరెక్టర్..
తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు పేరు ఈమధ్య కాలంలో పదే పదే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన చర్యలు, వ్యాఖ్యలతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారనే విమర్శలు జోరందుకున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా శ్రీనివాసరావు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంపిణి చేయాలని జిల్లాల వైద్యశాఖ అధికారులకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపైనే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. శ్రీనివాసరావు సీఎం పట్ల రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని ..ఆయన తీరు చూస్తుంటే ఒక వ్యక్తిని పూజిస్తున్నట్లుగా ఉన్నాయని ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
రాజభక్తికి నిదర్శనమా..
సీఎం జన్మదిన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు, ఆ శాఖలోని కింది స్థాయి అధికారులు సైతం మండిపడుతున్నారు. ఈతరహా ప్రవర్తన అధికారుల వ్యక్తిగత విలువను తగ్గించే విధంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. అయితే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై విమర్శలు రావడం కొత్తేమి కాదు. రీసెంట్‌గా ప్రగతిభవన్‌లో కేసీఆర్‌కు పాదాభివందనం చేయడాన్ని సోషల్ మీడియా సాక్షిగా ఎండగడితే ..తన తండ్రి వ్యక్తికి పాదాభివందనం చేస్తే తప్పేంటని సమర్ధించుకున్నారు.
వరుస వివాదాలు..
అంతకు ముందు బతుకమ్మ సంబురాల్లో డీజే టిల్లు పాటలకు డ్యాన్స్ చేస్తూ వార్తలకెక్కారు. అంతే కాదు ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తీవ్రత తగ్గిందని ..చెప్పడం, క్షుద్రపూజలు చేస్తున్నారంటూ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో దొరికిపోవడం వంటివి అందిరికి తెలుసు.
అసలు విషయం అదేనా..
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు తీరు చూస్తుంటే అధికారి నుంచి రాజకీయ నేతగా మారాలనే ప్రయత్నంలో ఉన్నారా అనే విమర్శలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఈతరహాలో రాజభక్తిని చాటుకుంటున్నారా ఏంటీ అని సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana News