తెలుగు సినిమా పరిశ్రమకు ఓ దర్శకుడిగా పరిచయమైన వ్యక్తి తన పేరును కళాతపస్విగా మార్చుకున్నారు డైరెక్టర్ కే.విశ్వనాథ్(K.Viswanath). ప్రేక్షకులను తన సినిమాలతో రంజింపజేయడమే కాకుండా తెలుగుదనాన్ని, సంప్రదాయాల్ని, ఆయన కథలతో, సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాధించుకున్నారు. కళాతపస్వీ కే.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్(KCR)తీవ్ర సంతాపం తెలియజేశారు. సాధారణ కథలను తన అద్భుతమైన ప్రతిభతో వెండితెర దృశ్యకావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కే. విశ్వనాథ్ అంటూ కేసీఆర్ తెలిపారు. విశ్వనాథ్ ఆరోగ్యం బాగోలేని సందర్భంలో సీఎం ఆయన నివాసానికి వెళ్లి మరీ పరామర్శించారు. ఆయనతో సంగీతం, సాహిత్యంపై జరిగిన చర్చను ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు.
లెజండ్రీ డైరెక్టర్ ఇక లేరు..
ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే. విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్ద పీట వేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. సంగీత సాహిత్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మక గా సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె విశ్వనాథ్ అని కీర్తించారు. దాదా సాహెబ్ ఫాల్కే , రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికి తురాయిగా నిలిచాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కే. విశ్వనాథ్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు.
కళాతపస్వీకి నివాళులు..
కవి పండితులకు జనన మరణాల భయం వుండదని, వారి కీర్తి అజరామరం అని..జయన్తి తే సుకృతినో ..రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయమ్..అనే వాక్కు విశ్వనాథ్ కు వర్తిస్తుందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అసమాన ప్రతిభావంతుడు..
తెలుగు సినిమా లెజండరీ డైరెక్టర్ కే. విశ్వనాథ్ మరణంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహతి, పద్మశ్రీ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్న లెజెండరీ డైరెక్టర్ కే. విశ్వనాథ్ సంస్కృతీ, సంప్రదాయ విలువలకు, సంగీతానికి పెద్దపీట వేస్తూ తెలుగు సినిమా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. భారతీయ సినిమా ఉన్నంత కాలం కె. విశ్వనాథ్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. కె. విశ్వనాధ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
చిరస్థాయిగా నిలిచే వ్యక్తి..
కే. విశ్వనాథ్మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, K viswanath, Tollywood news