Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణించాల్సిన ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనితో ఆయన ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన తెలంగాణ పర్యటన ముగించుకొని కొచ్చికి వెళ్ళాలి. కానీ విమానంలో తలెత్తిన టెక్నీకల్ ప్రాబ్లమ్ వల్ల ఆయన మరో విమానం సిద్ధమయ్యే వరకు వెయిట్ చేయనున్నారు. నిన్న హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా బీజేపీ నాయకులతో సమావేశం అయ్యారు. నేడు ఆయన తిరిగి వెళదామనుకున్న క్రమంలో ఫ్లైట్ లో సమస్య తలెత్తడంతో షెడ్యూల్ కాస్త లేట్ కానుంది. అయితే సాంకేతిక సమస్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
అంతకుముందు ఈరోజు ఉదయం CISF రైజింగ్ డే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలో 'Whasing Powder Nirma' పేరుతో Welcome To Amit Shah అంటూ పేర్కొన్నారు. ఇక ఈ ఫ్లెక్సీలో ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన నేతలతో కూడిన పోస్టర్ వెలిసింది. కాగా నిన్న టైడ్ పేరుతో పోస్టర్లు వెలవగా..ఇవాళ వాషింగ్ పౌడర్ నిర్మా పేరుతో హోర్డింగులు వెలవడం కలకలం రేపుతోంది. ఈ ఫ్లెక్సీలో హిమంత బిశ్వశర్మ, నారాయణ్ రానే, సువెందు అధికారి, సుజనా చౌదరి, ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింద్య, అర్జున్ కోట్ కర్ సహా పలువురు నేతల ఫోటోలను వాషింగ్ పౌడర్ నిర్మా ఫోటో స్థానంలో కేవలం తలను ఉంచి అమిత్ షాకు వెల్ కమ్ చెబుతున్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ పాలిటిక్స్ రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా వార్ నడుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారి దేశ రాజకీయాల్లో అడుగుపెట్టిన కేసీఆర్ బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను నిన్న ఈడీ విచారించింది. అయితే అదే రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రావడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో మరోసారి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఫ్లెక్సీల వార్ తారాస్థాయికి చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.