HYDERABAD STUDENT UNION LEADERS TORE DOWN BANNERS OF THE TRS PARTY ON THE OSMANIA UNIVERSITY CAMPUS AND SITUATIONS ARE IN TENSION PRV
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ రణరంగం.. టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లను చించేసిన విద్యార్థి సంఘం నేతలు..
ప్రతీకాత్మక చిత్రం
ఉస్మానియా యూనివర్సిటీ (Osmania university) రణరంగంగా మారింది. వర్సిటీ క్యాంపస్లో టీఆర్ఎస్ పార్టీ (TRS Party)కి చెందిన ప్లెక్సీలు రాత్రికి రాత్రే దర్శనమివ్వడంతో ఈ ఉద్రిక్తతకు కారణమయ్యింది.
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania university) రణరంగంగా మారింది. వర్సిటీ క్యాంపస్లో టీఆర్ఎస్ పార్టీ (TRS Party)కి చెందిన ప్లెక్సీలు రాత్రికి రాత్రే దర్శనమివ్వడంతో ఈ ఉద్రిక్తతకు కారణమయ్యింది. ఇప్పటికే ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీపై పీకల దాకా కోపంతో వున్న ఓయూ విద్యార్థులు ప్లెక్సీలను చించివేసి ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ప్లెక్సీలకే కాదు ఆ పార్టీ నాయకులు క్యాంపస్ లో అడుగుపెట్టినా ఇదే గతి పడుతుందని నిరుద్యోగ యువత హెచ్చరించారు. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు (CM KCR birthday). ఈ సందర్భం పురస్కరించుకుని టీఆర్ఎస్వీ (TRSV) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది.
క్యాంపస్ లో అడుగుపెట్టకుండా..
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొందరు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి వుంది. ఈ క్రమంలోనే వారికి స్వాగతం పలుకుతూ ఈనెల 27న రాత్రి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ఓయూలోని టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన పలువురు నాయకులు ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే ఇవాళ ఉదయం ఈ ప్లెక్సీలను చూసిన ఓయూ విద్యార్థులు ఆగ్రహంతో వాటిని చించేసి దగ్దం చేశారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యాంపస్ లో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. ఇందుకోసం సమాయత్తం అవుతున్నట్లు వివిధ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు వెల్లడించారు. ఫ్లెక్సీ లను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి నేతలు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన తర్వాతనే ఓయూ లో అడుగుపెట్టాలని హెచ్చరించారు. అలా కాకుండా ఓయూలో అడుగుపెడితే అడ్డుకుంటామని విద్యార్థులు టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం (CM KCR Government) రెండో సారి అధికారంలోకి వచ్చిన అనంతరం పెద్దగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల కాలేదు. దీంతో నిరుద్యోగుల్లో (Unemployed) తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలే (Government Jobs) లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అనేక మంది నుంచి ప్రభుత్వంపై అనేక విధాలుగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు సైతం ఈ అంశాన్ని అస్త్రంగా మార్చుకుని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి.
ఈ ప్రభావం వివిధ ఎన్నికల ఫలితాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఫలితాలు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు రావడానికి ఈ అంశం కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్ సర్కార్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దుబ్బాక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటిచారు. 2019 డిసెంబర్ లో ఆయన ఈ ప్రకటన చేశారు. 2020లో సీఎం ప్రకటన మేరకు నోటిఫికేషన్లు విడుదలవుతాయని అంతా భావించారు.
అయితే, కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ఉద్యోగుల కేటాయింపు పూర్తయితేనే ఖాళీల సంఖ్య పూర్తి స్థాయిలో తేలుతుందని భావించిన సర్కార్ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. అయితే, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, అనంతరం హుజూరాబాద్ ఉపఎన్నిక, మధ్యలో కరోనా సెకండ్ వేవ్ తదితర కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అయితే కొన్ని రోజులుగా నూతన జోనల్ విధానం, కొత్త జిల్లాల ఆధారంగా ఉద్యోగాల కేటాయింపుపై సీరియస్ గా దృష్టి సారించిన సర్కార్ సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.