వివాహ పరిచయ వేదికలో పేరు నమోదు చేసుకున్న ఓ యువతికి ఊహించని పరిణామం ఎదురైంది. అయితే చివరకు తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. కిస్మత్పూర్ ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల యువతి ప్రైవేట్ ఉద్యోగి. వివాహం చేసుకునేందుకు వివాహ పరిచయ వేదికలో తన పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసుకుంది. అయితే తాను రష్యాలో ఉంటానని చెబుతూ గత వారం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన వివరాలు తెలుపుతూ మాటలు కలిపాడు. ఫోన్లో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. త్వరలోనే హైదరాబాద్ వస్తున్నాని.. వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుందామని అతడు తెలిపాడు. ఆ మాటలు నమ్మిన యువతి తన జీవితం ఎంతో అందంగా ఉండబోతుందని ఊహించుకుంది.
ఆ యువకుడు గిఫ్ట్ పంపిస్తున్నానంటూ తెలిపి ఇంటి చిరునామా, తదితర వివరాలు తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి మాట్లాడుతున్నామంటూ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందని.. ట్యాక్స్ పేరుతో రెండు లక్షల రూపాయలు చెల్లించాలని వేరే వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆ యువతి రష్యా నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పిన యువకుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. గిఫ్ట్ చాలా విలువైనదని.. ట్యాక్స్ పే చేసి దానిని తీసుకోవాలని అతడు సూచించాడు. అయితే ఆ యువతి అంత డబ్బు తన వద్ద లేదని తెలిపింది.
దీంతో మూడు దఫాలుగా చెల్లించమని కోరారు. ఈ క్రమంలోనే శంషాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఖాతాలోకి యువతి డబ్బులు జమ చేయడం ప్రారంభించింది. మొత్తం మూడు దఫాలుగా రూ. 2 లక్షలు వారి ఖాతాలో జమ చేసింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఫోన్, గిఫ్ట్ తీసుకోస్తానని చెప్పిన వ్యక్తి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న యువతి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.