ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ సర్కార్ కు భారీ షాక్ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పు ఇచ్చింది. సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదని వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ క్రమంలో బీజేపీ, నిందితుల పిటీషన్లపై విచారించిన కోర్టు ఈ కేసును సీబీఐ (CBI)కి బదిలీ చేయాలనీ ఆర్డర్ జారీ చేసింది. కాగా ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసు సీబీఐకి అప్పగించాలన్న కోర్టు ఆదేశాలతో ..కపై సిట్ దర్యాప్తు చేయకూడదని, సిట్ ఏర్పాటును కొట్టి వేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
అక్టోబర్ 26న ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును పోలీసులు భగ్నం చేశారు. ఒక్కొక్కరికి రూ.50 కోట్లు చొప్పున డీల్ కోసం రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజి మంతనాలు జరిపారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఎమ్మెల్యేలలో రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ కొత్త కుట్రకు పూనుకున్నాడని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.
మొదటి నుంచి ఈ కేసును సీబీఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కానీ తెలంగాణ సర్కార్ ఈ కేసును దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి దర్యాప్తులో భాగంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా ఈ కేసు సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలివ్వడంతో బిగ్ టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంది. అయితే హైకోర్టు తీర్పుపై సిట్ అప్పీల్ కు వెళ్లనున్నట్టు తెలుస్తుంది.
అటు ఈడీ..ఇటు సీబీఐ..
కాగా ఈ కేసులో ఇటీవల ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని 2 రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు నేడు నిందితునిగా ఉన్న నందకుమార్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. అయితే ఓ వైపు ఈడీ విచారణ ఇటు సీబీఐకి కేసు అప్పగించడంతో ఇంకెన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. అలాగే హైకోర్టు తీర్పుపై సిట్ అప్పీల్ కు వెళ్లనుండడంతో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Telangana, TRS MLAs Poaching Case