తెలంగాణలోని (Telangana) సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల్లో(Ujjain Mahakali Bonalu) కీలక ఘట్టం రంగం కార్యక్రమం ముగిసింది. అమ్మవారు భక్తుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా జోగిని స్వర్ణలత(Swarnalatha)భవిష్యవాణి వినిపించారు. భక్తులు చేస్తున్న పూజలు, తీర్చుకుంటున్న మొక్కులు ఏవి మనస్పూర్తిగా, సంతోషంతో భక్తితో చేయడం లేదని అమ్మవారు భావిస్తున్నట్లుగా వినిపించారు. కేవలం పూజలు మొక్కుబడిగా భక్తుల సంతోషం కోసం చేస్తున్నారు తప్ప తనపై భక్తితో కాదని భవిష్యవాణిలో పేర్కొన్నారు. భక్తల్లో ఏ ఒక్కరైనా సంతోషంతో పూజలు, మొక్కులు తీర్చుకుంటున్నారో గుండెలపై చేయి వేసుకొని చెప్పాలంటూ భవిష్యవాణిలో వినిపించారు స్వర్ణలత. అయితే భక్తులను తాను బిడ్డలుగా భావించే భరిస్తూ కడుపులో పెట్టుకుంటున్నానని తెలిపారు. గర్భాలయంలో మొక్కుబడిగా కాకుండా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని అమ్మవారు కోరుతున్నట్లుగా భవిష్యవాణిలో జోగిని స్వర్ణలత తెలిపారు.
స్థిరమైన రూపం దాల్చబోతున్నా..
ఈసారి రంగం కార్యక్రమంలో భవిష్యవాణిలో కొన్ని కీలక విషయాలను వెల్లడించారు జోగిని స్వర్ణలత. తన రూపాన్ని ఇంకా ఎన్ని రూపాలుగా మారుస్తారంటూ భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు నచ్చినట్లుగా తనను మార్చడం కాదు తానే స్థిరమైన రూపంలో కొలువు దీరాలని అనుకుంటున్నట్లుగా భవిష్యవాణిలో అమ్మవారి నిర్ణయాన్ని వినిపించారు స్వర్ణలత.
Watch LIVE: Sri Ujjaini Mahakali Rangam https://t.co/Cpts4I8eZp
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 18, 2022
భక్తుల కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు..
ఇక పూజలు, మొక్కుల పేరుతో భక్తులు తనకు ఏం చేయాల్సిన అవసరం లేదని తాను తెచ్చుకున్న దాన్నే తనకు ఇస్తున్నారని...అందులో కూడా కొంత దొంగలు ఇష్టానుసారంగా తన సొత్తును కాజేస్తున్నారని భవిష్యవాణి వినిపించారు. తనకు పూజలు సరిగ్గా చేయని కారణంగనే భారీ వర్షాలు కురిపిస్తున్నానని ...భక్తుల కళ్లు తెరిపించడానికే ఈవిధంగా కుండపోత వర్షాలు పడుతున్నాయని భవిష్యవాణి వినిపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.