రిపోర్టర్: దస్తగిర్ అహ్మద్
లొకేషన్: హైదరాబాద్
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ నెల (Ramzan) ప్రారంభమైంది. ఉపవాస దీక్షలు మొదలయ్యాయి. ఐతే హైదరాబాద్ (Hyderabad)కు గర్వకారణమైన మక్కా మసీదు.. ఈ రంజాన్ సమయంలో మరింత ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎంతో పురాతనమైన ఈ మసీదు ముస్లింల భక్తి పారవశ్యంతో కొత్త శోభను సంతరించుకుంటుంది. ఇఫ్తార్ సమయంలో ఇక్కడ దాదాపు 2000 మంది పురుషులు, మహిళలు, పిల్లలు తమ ఉపవాసాన్ని విరమించుకోవడానికి గుమిగూడుతారు. శుక్రవారాలు, రంజాన్ చివరి రోజుల్లో ఈ సంఖ్య దాదాపు 5000కి పెరుగుతుంది. పవిత్ర మాసం ముగింపు రోజుల్లో మక్కా మసీదులోని ‘సెహన్’లో ప్రతిరోజూ 1000 మంది మహిళలు తమ ఉపవాసాన్ని విరమిస్తారు. ఇక్కడున్న పతేర్‌గట్టి క్లాత్ మార్కెట్ కూడా చాలా ఫేమస్. వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది.
లంబాడీలు ధరించే నగలు తయారు చేసే కుటీర పరిశ్రమ ఎక్కడుందో తెలుసా..?
రంజాన్ సమయంలో మక్కా మసీదులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మసీదు ప్రాంగణమంతా షామియాలు వేస్తారు. ఎంతో అందంగా ఉండే మసీదుకు ఇవి అదనపు ఆకర్షణ తీసుకొస్తాయి. ఉపవాసం ఉండే వారికి.. మసీదు అడ్మినిస్ట్రేషన్ ఉచిత ఖర్జూరాలు, త్రాగునీరు అందిస్తుంది. సాయంత్రం ఆరు గంటలు కాగానే ఇఫ్తారీ, హలీమ్, దహివాడ, ఇతర మిఠాయిలను కూడా విక్రయిస్తారు.దీనితో పాటు మసీదు వరండా దగ్గర ఉన్న కడాయ్‌లో వేడి వేడి వంటకాలను అప్పటికప్పుడు సిద్ధం చేస్తారు.
సాయంత్రం కాగానే... ఇఫ్తార్ కోసం పెద్ద ఎత్తున జనాలు తరలివస్తారు. అక్కడ అన్ని రకాల పండ్లతో పాటు స్పెషల్ వంటకాలు లభిస్తాయి. ఇఫ్తార్ సమయం అవగానే.. ప్రాంగణమంతా చాపలు వేసుకుంటారు. కొందరైతే నేల పైనే కూర్చుంటారు. త్వరగా వచ్చే వారికి మసీదులో చబుత్రాలు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ మంది రావడంతో... ఈ వరండాలు అందరికీ దొరకవు. మక్కా మసీదులోని 'సాహెన్'లో జరిగే ఇఫ్తార్ విందు.. వందలాది కుటుంబాలకు పిక్నిక్‌గా అనిపిస్తుంది. అనేక కుటుంబాలు.. తమ బంధమిత్రులతో కలిసి మసీదుకు వస్తారు. అందరూ కూర్చొని ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇఫ్తార్ సమయానికి మసీదుకు చేరుకున్న తర్వాత.. సైరన్ కోసం ఎదురుచూస్తారు. సైరన్ సౌండ్ రాగానే.. ఉపవాసాన్ని ముగించి.. తమకు నచ్చిన భోజనాన్ని చేస్తారు. వేర్వేరు రకాల పసందైన వంటకాలను అందరూ కలిసికట్టుగా కూర్చొని.. కబుర్లు చెప్పుకుంటూ ఆరగిస్తారు. కొత్త వారిని పరిచయం చేసుకొని బాగోగులను తెలుసుకుంటారు.
మక్కా మసీదులో ప్రార్థనలు చేసే స్థలాలు... పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఉంటాయి. పురుషులు షాహీ ఇమామ్ వెనుక ప్రార్థనలు చేస్తారు. మహిళలు నిజాం సమాధుల హాలులో రద్దీగా ఉండే ప్రదేశంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. రద్దీ కారణంగా.. ప్రార్థనల తర్వాత మసీదు నుంచి బయటకు వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుంది. బయటకు వచ్చే క్రమంలో... అందరూ తమకు తోచినంతగా యాచకులకు దాన ధర్మాలు చేస్తారు. కొందరు మాత్రం మసీదు ప్రాంగణంలోనే కూర్చుని గవా తాగుతూ... హలీం తింటూ.. కబుర్లు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇళ్లకు వెళ్లిపోతారు. రంజాన్ మాసంలో ప్రతి రోజూ ఇలాంటి దృశ్యాలే అక్కడ కనిపిస్తాయి. శుక్రవారాలు, రంజాన్ మాసం చివరి రోజుల్లో ఇక్కడ మరింత సందడి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Ramzan, Ramzan 2023