Hyderabad Rains: ఇవి రోడ్లేనా? చెరువులా? హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. షాకింగ్ వీడియోలు

హైదరాబాద్‌లో వర్ష బీభత్సాన్ని కళ్లకు గట్టే దృశ్యాలు

Hyderabad Rains: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. రోడ్లపై నిలిచిఉండే నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు.

 • Share this:
  రోడ్లు చెరువులయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. వాహనాలు పడవల్లా కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో  శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో భీకర వర్షం పడింది. ఆ భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. రాత్రి 07.30 నుంచి 3 గంటల పాటు కుండపోత వర్షం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. నగరవాసులు తమ పనులను ముగించుకొని ఇళ్లకు వెళుతున్న సమయంలోనే వర్షం కురవడంతో.. వారంతా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ రోడ్డు ఉందో.. ఎక్కడ నాలా ఉందో.. తెలియక భయం భయంగానే ఇంటికి చేరుకున్నారు. భారీ వర్షానికి చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

  Double Bedroom : డబుల్ ఇళ్లపై సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన .. సొంత స్థలాలు కూడా..

  చాంద్రాయణగుట్టలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చంపాపేట, అత్తాపూర్, చంద్రాయణగుట్ట, నాచారం, జిల్లేలగూడ పాటు పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వర్ష ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహేశ్వరం పరిధిలో  అత్యధికంగా 14 సెం.మీ. వాన కురిసింది. లింగోజిగూడలో  10.6, కుర్మగూడలో 10, హస్తినాపురంలో 8.8, మలక్‌పేటలో 8.7, సరూర్‌నగర్‌లో 8.6, కంచన్‌బాగ్‌లో 8.4, బహదూర్‌పురాలో 8.1, రెయిన్‌ బజార్‌లో 7.7, అత్తాపూర్‌లో 6.9, రాజేంద్రనగర్‌, శివరాంపల్లిలో 6.6, నాచారంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

  TS Politics : తెలంగాణలో మరో కొత్త పార్టీకి అంకురార్పణ.. నేతలతో మంతనాలు..?


  హైదరాబాద్‌లో వర్ష బీభత్సాన్ని కళ్లకు గట్టే దృశ్యాలు:

  వనస్థలిపురం సమీపంలో చింతల్ కుంట సమీపంలో ఓ వ్యక్తి బైక్‌తో పాటు నాలాలో పడిపోయాడు. బైక్ అక్కడే ఉండగా ఆయన మాత్రం కొట్టుకుపోయాడు. స్థానికులు తాడు సాయంతో ఆయన్ను కాపాడారు.  చాంద్రాయణగుట్టలో వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న ఆటో  భారీ వర్షానికి నదులను తలపించిన రోడ్లు  నవాజ్ సాహిబ్ కుంటలోని మక్కా కాలనీలో తాజా పరిస్థితి  అత్తాపూర్‌లో నీట మునిగిన కార్లు  పాతబస్తీలో ఓ హోటల్‌లోకి చేరిన వర్షపు నీరు


  భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. రోడ్లపై నిలిచిఉండే నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. డీఆర్ఎఫ్‌ బృందాలు కూడా  సిద్దంగా ఉండాలని చెప్పారు. వర్షం ప్రభావంతో ఏవైనా ఇబ్బందులు ఉంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ 040-21111111కు ఫిర్యాదు చేయాలని నగరవాసులకు సూచించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: