news18-telugu
Updated: August 16, 2020, 7:51 PM IST
హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు నీటి విడుదల (Image: AIR News Hyderabad)
హైదరాబాద్‌తో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో జలాయశయం పూర్తిగా నిండింది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. ఆదివారం జలాశయం నీటినిల్వ 513.64 మీటర్లకు చేరింది. ఈ క్రమంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు దిగువకు నీటిని వదిలారు. హోటల్ మారియట్ వద్ద ఉన్న చివరి గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 514.91 మీటర్ల నీటిమట్టం వరకు తట్టుకునేలా హుస్సేన్ సాగర్‌ను డిజైన్ చేశారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
కొత్త దశాబ్దాల క్రితం హుస్సేన్ సాగర్‌కు 21 గేట్లను అమర్చారు. జలాశయ పూర్తి స్థాయిలో నిండితే గేట్లను తెరిచి నీటిని వదులుతారు. ఇవాళ కూడా నీటిని దిగువకు విడుదలచేసే ముందే జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. దోమల్‌గూడ, హిమయత్‌నగర్, లిబర్టీ, అశోక్ నగర్ ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఐనా భయపడాల్సిన పనిలేదని నగర వాసులకు భరోసా ఇచ్చారు. హుస్సేన్ సాగర్‌లో వరద పరిస్థితిని జీహెచ్ఎంసీ లేక్స్ వింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టింది.
Published by:
Shiva Kumar Addula
First published:
August 16, 2020, 7:42 PM IST