హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయ్ లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. రాత్రి 8 గంటల సమయంలో విద్యార్థినికి నోట్స్, మెటీరియల్స్ ఇస్తానని చెప్పి ప్రొఫెసర్ రవిరంజన్ క్వార్టర్స్ కు తీసుకెళ్లాడు. అనంతరం విద్యార్థినికి మద్యం తాగించినట్టు తెలుస్తుంది. ఆపై ఆమెపై అత్యాచారయత్నానికి ప్రొఫెసర్ ప్రయత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని ప్రొఫెసర్ కొట్టాడు. అనంతరం అదే కారులో తీసుకొచ్చి యూనివర్సిటీ గేటు ముందు దింపేశాడు. ఇక అక్కడి నుండి విద్యార్థిని నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కేసు నమోదు..ప్రొఫెసర్ సస్పెండ్..
కాగా ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసుకొని ప్రొఫెసర్ రవిరంజన్ ను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని చెప్పిన వివరాలను బట్టి దర్యాప్తు చేపట్టారు. కాగా విద్యార్థినికి వైద్య పరీక్షలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న HCU ప్రొఫెసర్ రవిరంజన్ ను సస్పెండ్ చేశారు. దీనితో గేటు ముందు విద్యార్థులు చేస్తున్న ఆందోళనను విరమించారు. కాగా గతంలో కూడా ఈ ప్రొఫెసర్ పై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని యూనివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు. ఆ సమయంలో ప్రొఫెసర్ రవిరంజన్ పై చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చేది కాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినులకు రక్షణేది?
ఉన్నత చదువుల కోసం థాయ్ లాండ్ నుండి హైదరాబాద్ కు వచ్చిన విద్యార్థినిపై HCU ప్రొఫెసర్ అత్యాచారయత్నానికి పాల్పడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రొఫెసర్ రవిరంజన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఇలాంటి ఘటన జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురువుతున్నారు. ఇంత పెద్ద యూనివర్సిటీలో విద్యార్థినులకు రక్షణ లేకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిజమే అయితే చర్యలు..
ఒకవేళ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం పాల్పడిన ఘటన నిజమే అయితే అది యూనివర్సిటీకి మాయని మచ్చే అని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రొఫెసర్ రవిరంజన్ ను సస్పెండ్ చేసిన HCU మరిన్ని చర్యలు తీసుకోవచ్చు. అలాగే పోలీసులు కూడా నిందితుని విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి పోలీసుల దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, HCU, Hyderabad, Telangana