HYDERABAD PRIME MINISTER NARENDRA MODI WILL COME TO HYDERABAD TODAY AND THIS IS THE COMPLETE SCHEDULE OF HIS VISIT PRV
PM Narendra modi: నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రాక.. షెడ్యూల్ పూర్తి వివరాలివే..
ప్రధాని మోదీ (Image : PTI)
హైదరాబాద్‌లో నేటి నుంచి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. దీంట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు హైదరాబాద్ రానున్నారు. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే..
హైదరాబాద్ (Hyderabad)లో నేటి నుంచి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National Executive meeting 2022), బహిరంగ సభ దృష్ట్యా నగరవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రెండు రోజులూ వీఐపీలు చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ పహారా కాస్తున్నారు. నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం అమ్మవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేడు హైదరాబాద్ రానున్నారు. శనివారం, ఆదివారం జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అదేవిధంగా నోవాటెల్ హోటల్లో బస చేయనున్న మోదీకి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
బీజేపీ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్న నేపథ్యంలో నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. గత రెండు రోజులుగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకుంటున్న ప్రముఖలు సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసులు అప్రమత్తమై చార్మినార్ చుట్టూ పికెట్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో సుమారు 28 నుంచి 30 గంటల పాటు సాగనున్న మోదీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నారు పోలీసులు. హెచ్ఐసీసీ పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. హెచ్ఐసీసీకి 5 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్, నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. 4 రోజుల పాటు పూర్తిగా పోలీసుల నిఘాలో హెచ్ఐసీసీ ఉండనుంది.
షెడ్యూల్ ఇదే..
జూలై 2న మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరానికి బయలుదేరుతారు. 2.55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మాదాపూర్ హెచ్ఐసీసీకి వెళతారు. 3.20 గంటలకు నోవాటెల్ కు చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోదీ హాజరు కానున్నారు . రాత్రి 9 గంటల వరకు సమావేశంలోనే ఉండనున్నారు . ఇక జూలై 3 ఉదయం 10 గంటలకు పార్టీ సమావేశాలకు హాజరవుతారు. సాయంత్రం 4.30 వరకు సమావేశాల్లోనే ఉంటారు. పలు అంశాలపై కార్యవర్గ సభ్యులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత హోటల్ కు వెళతారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు సాయంత్రం 5:55 గంటలకు హెచ్ఐసీసీ నుంచి బయలుదేరుతారు. 6.30 పరేడ్ గ్రౌండ్స్ సభకు మోదీ చేరుకుంటారు. 6.30 నుంచి 7.30 వరకు సభలో ఉంటారు. అక్కడ ప్రజలు, కార్యకర్తలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఇక జులై 4న ఉదయం 9.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు మోడీ. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్తారు. కాగా భద్రత కారణాలతో మోడీ పర్యటనలో కొన్ని మార్పులు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
7 వేల మందితో బందోబస్తు..
పరేడ్ గ్రౌండ్స్ సభ తర్వాత రాజభవన్‌లోనే ప్రధాని బస చేయనున్నట్లు నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఇదివరకే. ఈ మేరకు రాజభవన్లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. హెచ్ఐసీసీ, బేగంపేట, రాజభవన్ మార్గాల్లో 4వేల మంది, పేరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానికి అక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్త్ లో ఉండనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.