HYDERABAD POLICE HAVE ARRESTED THREE PEOPLE FOR ALLEGEDLY COLLABORATING WITH THE ACCUSED IN A CYBER ROBBERY AT AP MAHESH BANK PRV
AP Mahesh bank: ఏపీ మహేశ్ బ్యాంకు కేసులో పోలీసుల ముందడుగు.. తీగ లాగితే కదులుతున్న డొంక.. పలువురి అరెస్టు
హైదరాబాద్ లోని మహేశ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం
ఏపీ మహేశ్ బ్యాంకు కేసులో మూడు ఖాతాల్లోంచి నగదును హ్యాకర్లు 128 ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసింది. పోలీసులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా దొరికిని ప్రతీ ఆధారాన్ని సేకరించి ముందుకు పోతున్నారు. తాజాగా పోలీసులు నేరానికి సహకరించిన వారిని అరెస్టు చేశారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన భారీ బ్యాంకు దోపిడీ ఘటనలో కీలక అంశాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లోని ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకు (AP Mahesh Co-operative Bank)పై సైబర్ నేరగాళ్లు పంజా విసరడం, బంజారాహిల్స్‌లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోని సర్వర్ (Server)లోకి చొరబడి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్ల నగదును కొట్టేయడం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించి కొంత డబ్బును కాపాడగలిగారు. కేసుపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే రూ.12.4 కోట్లు కొట్టేసిన సైబర్ (Cyber) కేటుగాళ్లు ఆ నగదును ముగ్గురి ఖాతాల్లోకి (Three Accounts) జమచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు వాళ్ల కోసం గాలిస్తున్నారు. అయితే అధికారులకు రోజురోజుకీ ఈ కేసు సవాల్ విసురుతోంది. ఎందుకంటే ఆ మూడు ఖాతాల్లోంచి నగదును హ్యాకర్లు 128 ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసింది. దీంతో డబ్బు రికవరీ అంత ఆషామాషీ కాదని అర్థం అవుతోంది. అయితే పోలీసులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా దొరికిని ప్రతీ ఆధారాన్ని సేకరించి ముందుకు పోతున్నారు. ఇద్దరు నైజీరియన్లు జములు, ఇమ్మానియేల్ మణిపురి యువతి షిమ్రాంగ్ లను బెంగళూరులో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు మంగళవారం తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు.
కమిషన్ కక్కుర్తితో..
జములు, షిమ్రాంగ్ లవర్స్ అని, ఇద్దరూ కలిసే ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. మహేష్ బ్యాంకు సర్వర్ లోకి ప్రవేశించి రూ. 12.90 కోట్లు కొల్లగొట్టిన నైజీరియన్ ఈ మొత్తాన్ని దేశంలోని వేర్వేరు నగరాల బ్యాంకుల్లో 128 ఖాతాలకు నగదు బదిలీ చేశాడు. ఇందులో ఓ బ్యాంకు ఖాతా షిమ్రాంగ్ ది. ఆ బ్యాంకు ఖాతా వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ సతీష్ బృందం సోమవారం బెంగళూరుకు వెళ్ళింది. ఫోన్ నెంబర్, ఇతర వివరాల ఆధారంగా షిమ్రాంగ్, జములు, ఇమ్మానుయేల్ లను పట్టుకున్నారు. బెంగళూరులోనే మరికొంత మంది నిందితులు ఉన్నారన్న సమాచారంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు
ఏపీ మహేష్ బ్యాంక్ (AP Mahesh bank) నుంచి నగదు కాజేసేందుకు బ్యాంకు ఖాతా ఇస్తే కేరళలో ఉన్న వారికి పది శాతం, ఢిల్లీలో 15 శాతం, బెంగళూరులో 30 శాతం కమీషన్ ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. వారితో మాట్లాడుకున్నాక ప్రధాన నిందితుడు మొత్తం 128 ఖాతాల్లోకి చకచకా నగదు బదిలీ చేశాడు.
షిమ్రాంగ్ ఖాతాలోకి రూ 52. లక్షలు..
ప్లాన్‌లో భాగంగా షిమ్రాంగ్ ఖాతాలోకి రూ. 52 లక్షలు జమ చేశాడు. ఈ నగదును ఆమె ఇమ్మానియేల్, జములు సహకారంతో వేగంగా విత్ డ్రా (With draw) చేసుకుంది. ఆ తర్వాత తన కమిషన్ మినహాయించుకుని నైజీరియన్ సూచించిన వారికి నగదు ఇచ్చేసింది. పోలీసు అధికారి సతీష్ బృందం షిమ్రాంగ్, ఆమెతో పాటు పట్టుపడిన వారి వివరాలను సేకరించారు.
చదువుకునేందుకు వచ్చి..
బెంగళూరు ఐదేళ్ల క్రితం చదువుకునేందుకు వచ్చిన ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. నైజీరియా నుంచి వచ్చిన జములుతో మూడేళ్ల క్రితం పరిచయమయ్యింది. జములు రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో బీఫార్మసీ చదువుకుంటున్నాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. మరోవైపు నైజీరియా నుంచి చదువుకునేందుకు బెంగళూరు వచ్చిన ఇమ్మానుయేల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. అతడికి మహేష్ బ్యాంకు పై సైబర్ దాడి చేసిన నైజీరియన్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.