హైదరాబాద్ (Hyderabad)లాంటి మహా నగరాల్లో ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉదయం విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు సిటీలో గంటలకొద్దీ ట్రాఫిక్ (Traffic)లో చిక్కుకొని ఇబ్బందులు పడుతుంటారు. దుమ్ముధూళి, రణగొణ ధ్వనుల మధ్య నరకం చూస్తుంటారు. ఇక సిగ్నళ్ల వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఐదారు వరుసల్లో భారీగా వాహనాలు ఆగుతుంటాయి. ఆ సమయంలో వెనకాల నుంచి హారన్‌ల (Horns) మోత మోగుతుంది. రెడ్ సిగ్నల్ పడినా కొందరు వాహనదారులు హారన్ కొడుతూనే ఉంటారు. ఇప్పటికే వాహనాల నుంచి వెలువడే పొగతో వాయు కాలుష్యమవుతుండగా..దీనికి తోడు ఇలా పదే పదే హారన్‌లు కొట్టడంతో శబ్ధ కాలుష్యం (Sound pollution) కూడా అవుతోంది. ఇలా చిత్ర విచిత్రమైన ధ్వనులతో హారన్ కొడుతూ (blow the horn with strange noises).. రోడ్లపై దూసుకుపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త! జూన్ 1 నుంచి నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై ట్రాఫిక్ పోలీసులు చార్జిషీట్ దాఖలు (Cases) చేయనున్నారు.
స్పెషల్ డ్రైవ్..
ఎయిర్, ప్రెషర్, మల్టీటోన్డ్ వంటి నిషేధిత హారన్ వినియోగిస్తూ ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై నగర ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic police) కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. నిషేధిత హారన్లు వినియోగించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ (Special drive) చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 3,320కిపైగా వాహనాలకు ఉన్న నిషేధిత హారన్లను తొలగించారు.
ఆయా వాహనదారులకు ఎంవీ యాక్ట్ 190 (2) సెక్షన్ ప్రకారం రూ.1,000 జరిమానా విధించారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం (సీఎంవీఆర్)–1988 సెక్షన్ 52 ప్రకారం తయారీదారుల నుంచి వచ్చిన వాహన హారన్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ప్రతి వాహనానికీ ఎలక్ట్రిక్ హారన్ (Electric Horn) మాత్రమే ఉండాలి.
కేసులు ఎలా నమోదవుతాయి..?
శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి నగరంలో అకౌస్టిక్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. రోడ్లపై అదే పనిగా హారన్ (Horn) కొట్టేవారిని ఈ కెమెరాలు పట్టేస్తాయి. హారన్ శబ్దం ఆధారంగా ఏ వైపు వాహనం నుంచి సౌండ్ వచ్చిందో ఈ కెమెరాలు గుర్తిస్తాయి. అటువైపు తిరిగి ఫొటో, వీడియో తీస్తాయి. నగరంలోని రోడ్లపై మరో మూడు వారాల్లో ఇవి పనిచేయడం ప్రారంభించనున్నాయి. వాహనాలను ఈజీగా గుర్తించి ఫోటో తీసే ఎత్తులో కెమెరాలు అమర్చి ఉంటాయి. అదే పనిగా హారన్ కొట్టేవారిని, నిషేధిత ప్రాంతాల్లో హారన్‌లు కొట్టి శబ్ద కాలుష్యం చేసే వారిని కెమెరా గుర్తిస్తుంది. హారన్ శబ్దం రాగానే కెమెరాలో ఉన్న మైక్రోఫోన్ లెవెల్ పెరుగుతుంది. దాంతో శబ్దం వచ్చే వాహనం దిశలో కెమెరా టర్న్ అవుతుంది. వాహనం, నెంబర్ ప్లేట్‌లను ఫోటో తీయడమే కాకుండా.. ఆధారాల కోసం రెండు మూడు సెకన్ల వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. వెంటనే ఆ ఫోటో, వీడియో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. ఆ తర్వాత సదరు వాహనంపై చర్యలు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Hyderabad Traffic Police, Sound