ప్రముఖ తెలంగాణ కవి ఎమ్మెల్సీ, గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది.ఆయనకు కవిత్వ విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
కవిత్వం విభాగంలో ఆయన రచించిన "వల్లంకి తాళం" కవితా సంపూటికి ఈ అవార్డు దక్కింది. కాగా ఈ అవార్డు కింద లక్ష రూపాయల నగదుతో పాటు ప్రశంసపత్రం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను దేశంలోని మొత్తం 20 భాషల్లోని రచనలకు ఈ అవార్డును ప్రకటించారు. కాగా గుజరాత్ ,మణిపూరి, ఉర్దు బాషలకు గాను పెండింగ్ పెట్టారు. వారిని త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు.
సీఎం కేసిఆర్ హర్షం
గోరెటి వెంకన్న కు ప్రతిష్టాత్మక అవార్డు – 2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. గోరెటి వెంకన్నకు ఈ సందర్బంగా సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని సిఎం అన్నారు. మానవ జీవితానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని..మనిషికి ఇతర జంతు పక్షి జీవాలకు వున్న అనుబంధాన్ని గోరెటి వెంకన్న అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరెటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోశించారని తెలిపారు . గోరెటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సిఎం పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.