పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్న రోజురోజుకు సైబర్ నేరాలు మాత్రం పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా కూడా... చాలామంది అమాయకులు బలైపోతున్నారు. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. రోజురోజుకు కొత్త తరహా మోసాలకు సైబర్ కేటుగాళ్లు తెరలేపుతున్నారు. అమాయకుల ఆశను ఆసరాగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు అనుకున్నవాళ్ల ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా మరొక కొత్త తరహా సైబర్ స్కామ్ తెరపైకి వచ్చింది. యూట్యూబ్ లో లైక్ కొడితే చాలు.. ఒక్కో లైక్ కు రూ.50 ఇస్తామని నమ్మించారు. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆరుగురు వ్యక్తులనుంచి దాదాపు రూ.75 లక్షలు మేర లూటీ చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తర్వాత మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
వివారల్లోకి వెళ్తే.. హైదరాబాద్ భరత్ నగర్ కు చెందిన ఓ యువకుడికి పార్ట్ టైం జాబ్ ఉందని వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. ఇంట్లో కూర్చొని పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదిచొచ్చు అని ఆ యువకుడు.. అనుకున్నాడు. వెంటనే తనకు మెసేజ్ వచ్చిన వాట్సాప్ నెంబర్ కు కాల్ చేసి మాట్లాడాడు. ఉద్యోగం వచ్చే వరకు వాళ్లు పంపించే యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొట్టాలని తెలిపారు. ఒక్కో లైక్ కు రూ.50 ఇస్తామని నమ్మించారు. కొద్ది రోజుల వరకు లైక్ కు రూ.50 చొప్పున చెల్లిస్తూ వచ్చారు. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది.
పార్ట్ టైం జాబ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలంటూ.. తెలిపారు. దశల వారీగా రూ. 25 లక్షలు చెల్లించుకున్నారు. అయితే డబ్బులు వస్తాయన్న ఆశతో అది నమ్మినవారు గుడ్డిగా లక్షలు చెల్లించారు. దీంతో ఆ డబ్బంతా తీసుకొని సైబర్ నేరగాళ్లు ఉడాయించారు. ఇలానే బతుకు దెరువు కోసం సిటీకి వచ్చిన ఓ రైతును కూడా బురిడీ కొట్టించారు. పార్ట్ టైం జాబ్, ఇన్వెస్ట్ మెంట్ పేరుతో అతని దగ్గర కూడా రూ. 25 లక్షలు కాజేశారు. షేక్ పేట్ వ్యక్తి దగ్గర రూ. 9 లక్షలు, యూసఫ్ గుడ వాసి దగ్గర రూ.10 లక్షలు... ఇలా సిటీకి చెందిన చాలామంది దగ్గర మాయ మాటలు చెప్పి డబ్బు తీసుకొని బోర్డు తిప్పేశారు. దీంతో చివరికి బాధితులు చేసేది లేక.. పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇలాంటి వారిని నమ్మకూడదని.. పోలీసులు తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Hyderabad, Local News