హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Bjp Mla Rajasingh)కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈనెల 29న ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ (Bjp Mla Rajasingh) ఓ వర్గం వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. బెయిల్ సమయంలో కోర్టు ఇచ్చిన షరతులను ఎమ్మెల్యే ఉల్లంఘించారని అన్నారు. కాగా ఈ నోటిసులపై రాజాసింగ్ (Bjp Mla Rajasingh) స్పందించారు. తాను ఎప్పుడైనా ధర్మం కోసం పోరాటం చేస్తానని, తనను తెలంగాణ నుంచి బహిష్కరించిన లేక జైలులో పెట్టినా కూడా ధర్మం కోసమే పని చేస్తానని చెప్పారు. నాకు నిన్ననే పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. కాగా రాజాసింగ్ కు ఇప్పటికే పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే.
గతంలో కూడా నోటీసులు..
గతేడాది అజ్మీర్ దర్గాపై ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ (BJP MLA Raja singh) పై కేసు నమోదు అయింది. ఆ తరువాత ఈ కేసును కంచన్ భాగ్ నుండి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళ్ హాట్ పోలీసులు జనవరి 20న 41A CRPC కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బెయిల్ పై బయటకు రాజాసింగ్..
కాగా ఈ ఏడాది ఆగష్టు 25న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 29న పీడీ యాక్ట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్ (Raja Singh) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. తనపై నమోదు చేసిన పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలని రాజాసింగ్ (Raja Singh) కమిటీకి విన్నవించుకున్నాడు. అయితే తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేసినట్టు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బోర్డు దృష్టికి తీసుకొచ్చాడు. కానీ దీనిపై విచారణ జరిపిన బోర్డు పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను సమర్ధించింది. పీడీ యాక్ట్ ఎత్తివేయాలన్న రాజాసింగ్ (Raja Singh) అభ్యర్ధనను కమిటీ తిరస్కరించింది. కానీ దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేయగా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉంటే 2004 నుంచి రాజాసింగ్‌పై 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 కేసులు కేవలం మతపరమైన విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవే కావడం గమనార్హం. ఇప్పటికే రాజాసింగ్ పై పీడి యాక్ట్ కూడా నమోదు అయింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒక ఎమ్మెల్యేపై పీడీయాక్టు నమోదు కావడం ఇదే మొదటిసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Raja Singh, Telangana