హైదరాబాద్(Hyderabad)లో హవాలా మనీ పెద్ద మొత్తంలో చేతులు మారుతోంది. తాజాగా శనివారం రాత్రి కోకాపేట్ నుంచి నార్సింగ్ వైపు వెళ్తున్న రెండు కార్లలో సుమారు కోటి రూపాయలు( One Crore rupees) తరలిస్తుండగా పోలీసులు(Police) పట్టుకున్నారు. రెండు కార్లలో నగదు తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు. అయితే డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారని పోలీసులు నిందితులను విచారించడంతో విషయం బయటపెట్టారు. కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి(Komatireddy Sumanth Reddy), కోమటిరెడ్డి సూర్య పవన్ (Komatireddy Surya Pawan)అనే ఇద్దరు వ్యక్తులకు పోలీసులు పట్టుకున్న కోటి రూపాయలు ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్లుగా తెలిపారు. హవాలా మనీ పట్టుకున్న పోలీసులు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఇంకా వివరాలు పూర్తిగా రాబట్టిన తర్వాత మీడియాకు తెలియజేస్తామని నార్సింగ్ పోలీసులు వెల్లడించారు.
ఈ డబ్బంతా వాళ్లదేనా..
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాత నుంచి పెద్ద మొత్తంలో హవాలా మనీని పట్టుకున్నారు పోలీసులు. ఎన్నిక జరుగుతోంది నల్లగొండ జిల్లాలో అయినప్పటికి ప్రతి జిల్లా సరిహద్దుల్లో నిఘా పెట్టి , తనిఖీలు ముమ్మరం చేశారు. గత వారంలో ఏడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు అధికారులు. ఈసారి పట్టుబడిన నిందితులు సైతం కోమటిరెడ్డి అనే ఇంటి పేరు కలిగిన వ్యక్తుల పేర్లు చెప్పడంతో ఖచ్చితంగా ఇది కూడ మునగోడు ఓటర్ల కోసం తరలించడానికే తీసుకెళ్తున్నారని పోలీసులు భావిస్తున్నారు.
10రోజుల్లో 11 కోట్ల నగదు ..
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు నెంబర్ 12లో కారులో తరలిస్తున్న రెండు కోట్ల రూపాయలను అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు,బంజారా హిల్స్ పోలీసులు సంయుక్తంగా ఈ హవాలా మనీ ముఠాను పట్టుకున్నారు. పట్టుబడిన రెండు కోట్ల నగదును సీజ్ చేశారు. నగదు, కారును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. కేవలం వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్లో పట్టుబడిన హవాలా మనీ 9.3కోట్లకు చేరుకుంది.
మునుగోడు ఓటర్ల కోసమేనా..
అంతకు ముందు మూడ్రోజుల క్రితం హైదరాబాద్లో గాంధీనగర్లో 3.5కోట్ల హవాలా మనీని పట్టుకున్నారు టాస్క్ఫోర్స్ పోలీసులు. దీంతో గడిచిన మూడ్రోజుల వ్యవధిలోనే సుమారు ఏడు కోట్ల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో వరుసగా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంతో పాటు జిల్లా బోర్డర్లలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎవరి నుంచి ఎవరికి ఇంత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతోందనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ధనప్రవాహం పారిస్తోంది ఎవరూ..?
మునుగోడు బైపోల్ కోసం ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు. మరోవైపు స్థానిక ఓటర్లను ప్రలోభపెడుతున్నారని టీఆర్ఎస్ నాయకుల ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే ..కాదు బీజేపీ అభ్యర్ధి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారంటూ కాంట్రాక్ట్పే అంటూ పోస్టర్లు అంటించడంతో ఉపఎన్నిక ఉత్కంఠగా మారుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad crime, Telangana News