మానవమృగాలు మరో మైనర్ బాలికను చెరబట్టాయి. నిత్యం పోలీసు పెట్రోలింగ్(Patrolling), గల్లీ గల్లీల్లో సీసీ కెమెరాలు(CC cameras) అమర్చినప్పటికీ కామాంధుల కళ్లు అభం,శుభం తెలియని ఆడవాళ్లపై పడుతూనే ఉన్నాయి. ఈనెల 4వ తేదిన చంద్రాయణగుట్ట(Chandrayangutta)లో మెడికల్ షాపుకు మందుల కోసం వెళ్లిన ఒక బాలికను మరో మహిళ ద్వారా ట్రాప్ చేసి నలుగురు యువకులు ఎత్తుకెళ్లారు. అటుపై బాలికకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఈకేసులో సంబందం ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.
మైనర్ బాలికపై దారుణం..
హైదరాబాద్ మహానగరంలో ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామాంధుల కళ్ల నుంచి బాలికలు, మహిళలు, యువతులను ఎవరూ కాపాడలేకపోతున్నారు. ఈనెల 4వ తేదిన చంద్రాయణగుట్టలో మెడికల్ షాపుకు మందుల కోసం వెళ్లిన ఓ మైనర్ బాలికను వాలి అనే మహిళ ట్రాప్ చేసింది. తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ నమ్మించి తన వెంట తీసుకెళ్లింది. అక్కడి నుంచి మహిళ బాలికను రాహుల్, పవన్, చంటితో పాటు మరో యువకుడికి అప్పగించడంతో వారు కందికల్ గేటు దగ్గర్లో ఉన్న చిన్నా అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లారు.
ట్రాప్ చేసి..సామూహిక అత్యాచారం
రాత్రి 9గంటల సమయంలో బాలికకు మద్యం తాగించారు కామాంధులు. అటుపై ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లుగా బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఫిబ్రవరి 5వతేది ఉదయం తేరుకున్న బాలిక వివస్త్రగా ఉండటం, తనపై అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని తల్లితో చెప్పడంతో ఆమె ఛత్రినాకా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సార్ ..మీ అవసరం ఉంది..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఆరుగురితో పాటు మరో ఐదుగురి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. నిందితుల్లో వాలి అనే మహిళతో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈసంఘటనపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. దోషుల్ని వదిలిపెట్టవద్దని కోరుతున్నారు. మరోవైపు సినీ దర్శకుడు హరీష్‌శంకర్ సైతం ట్విట్టర్ ద్వారా మాజీ సీపీ, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. సార్ మీ అవసరం మాకు బాగా ఉందంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు.
Respected @tsrtcmdoffice Sajjanar Sir we “Badly” need you !!!! pic.twitter.com/bSOQ28D1hp
— Harish Shankar .S (@harish2you) February 8, 2023
నేరాలను అరికట్టేదెలా ..
మెట్రోనగరం నుంచి గ్లోబల్ సిటీగా మారినప్పటికి హైదరాబాద్‌లో ఇలాంటి దారుణాలు మాత్రం తగ్గడం లేదు. గతంలో అంటే 2019 డిసెంబర్ 6వ తేదిన ఇదే తరహాలో దిశపై అత్యాచారం, హత్య జరిగింది. ఆ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడినప్పటికి సమాజంలో ఉండే మానవ మృగాల్లో మార్పు మాత్రం రావడం లేదని హైదరాబాద్ ప్రజలు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad crime, Minor girl raped