ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా 33 సంవత్సరాల పాటు అతడు కష్టపడ్డాడు. ఎందుకంటే పదో తరగతి పాస్ అవ్వడానికి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని నడిచాడు అనే కథలో చదివినట్టు ఆయన పట్టువదలకుండా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షలు రాస్తూనే ఉన్నారు. ప్రతిసారీ ఫెయిల్ అవుతూ వచ్చారు. కానీ, కరోనా వచ్చి ఆయన్ను పదో తరగతి పాస్ చేయించింది. ఔను. కరోనా వల్ల పదో తరగతి పరీక్షలు జరగకపోవడంతో దరఖాస్తు చేసిన అందరినీ పాస్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయన కూడా పాస్ అయ్యారు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరనుకుంటున్నారా. ఆయన హైదరాబాద్కు చెందిన నూరుద్దీన్. మొదటిసారి 1987 సంవత్సరంలో మొదటిసారి పదో తరగతి పరీక్షలు రాశారు. అప్పుడు ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యారు. అప్పటి నుంచి దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ప్రతి సారీ.. 30, 33 మార్కులు వచ్చి ఫెయిల్ అవుతున్నారు. పాస్ కావడానికి కనీసం 35 మార్కులు కావాలి. ఈ క్రమంలో ఆయనకు వయసు కూడా దాటిపోయింది. 51 సంవత్సరాలు వచ్చాయి. ఈ క్రమంలో మళ్లీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఆయనకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఓపెన్ స్కూల్ విధానంలో అప్లై చేశారు. అయితే, ఈసారి అన్ని పరీక్షలు రాయాల్సి ఉంది. అందుకు కూడా సిద్ధమై.. రూ.3000 ఫీజు కూడా కట్టారు. ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం నిర్వహించలేదు. రెగ్యులర్ వాళ్లకు మాత్రం వారికి గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా పాస్ చేశారు. ఓపెన్ స్కూల్ విధానంలో అప్లై చేసిన వారికి మాత్రం అందరికీ 35 మార్కులు ఇచ్చి పాస్ చేశారు. దీంతో నూరుద్దీన్ 33 ఏళ్ల పరీక్షల దండయాత్రకు బ్రేక్ పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.