HYDERABAD MAHESH BANK ROBBERY CASE IS TAKING A TURN THAT CYBER CRIMINALS SENT MONEY FROM THREE ACCOUNTS TO 128 ACCOUNTS PRV
Mahesh bank case: మహేశ్ బ్యాంకు దోపిడీలో కొత్త ట్విస్టు.. మూడు అకౌంట్ల నుంచి 128 అకౌంట్లకు నగదు బదిలీ చేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ లోని మహేశ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం
మహేశ్ బ్యాంకు దోపిడీ వ్యవహారం మలుపులు తిరుగతోంది. ఇప్పటివరకు 12 కోట్లకు పైగా నగదు తమ ఖాతాలో వేసుకున్న సైబర్ నేరగాళ్లు. ఇపుడు ఆ ఖాతాల నుంచి మరో కొత్త వ్యూహం రచించారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన భారీ బ్యాంకు దోపిడీ ఘటనలో కీలక అంశాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లోని ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకు (AP Mahesh Co-operative Bank)పై సైబర్ నేరగాళ్లు పంజా విసరడం, బంజారాహిల్స్‌లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోని సర్వర్ (Server)లోకి చొరబడి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్ల నగదును కొట్టేయడం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించి కొంత డబ్బును కాపాడగలిగారు. కేసుపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే రూ.12.4 కోట్లు కొట్టేసిన సైబర్ (Cyber) కేటుగాళ్లు ఆ నగదును ముగ్గురి ఖాతాల్లోకి (Three Accounts) జమచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు వాళ్ల కోసం గాలిస్తున్నారు. అయితే అధికారులకు రోజురోజుకీ ఈ కేసు సవాల్ విసురుతోంది. ఎందుకంటే ఆ మూడు ఖాతాల్లోంచి నగదును హ్యాకర్లు 128 ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసింది. దీంతో డబ్బు రికవరీ అంత ఆషామాషీ కాదని అర్థం అవుతోంది.
ఇద్దరి ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా నగదు డిపాజిట్..
హ్యాకింగ్ కేసు (hacking case)లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ముగ్గురి ఖాతాలను గుర్తించిన పోలీసులు... వారిలో ఇద్దరిని ఇప్పటికే ప్రశ్నించారు. వారిద్దరికీ ఈ హ్యాకింగ్ తో సంబంధంలేదని తేల్చారు. సైబర్ నేరగాళ్లు వినోద్, నవీన్ అనే ఇద్దరి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా నగదు డిపాజిట్ (Money Deposit) చేసినట్లు తెలిపారు. అయితే ఆ ఇద్దరి ఖాతాల నుంచి నగదును సైబర్ నేరగాళ్లు ఇతర ఖాతాల్లోకి డిపాజిట్ చేసినట్లు పోలీసుల విచారణ (Police Investigation)లో తేలింది. ఈ ఖాతాల్లో మూడో వ్యక్తి షానవాజ్ ఖాతాలో రూ.6.9 కోట్లు జమ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ ఖాతా నుంచి ఇతర ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. అయితే షానవాజ్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ ఖాతాల నుంచి మరో 200 ఖాతాలకు నగదు బదిలీ అయ్యే అవకాశం..
షానవాజ్ కొన్ని నెలల కిందట ముంబయి (Mumbai)లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు షానవాజ్ సహకరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురి ఖాతాల నుంచి రూ.12.4 కోట్ల నగదును సైబర్ నేరగాళ్లు ఇప్పటికే 128 ఖాతాలకు బదిలీ చేశారు. ఆ ఖాతాల నుంచి మరో 200 ఖాతాలకు నగదు బదిలీ అయ్యే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల పరిశీలన కోసం తెలంగాణ పోలీసులు కోల్‌కతా వెళ్లనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.