Lal Darwaza Bonalu: బోనమెత్తిన భాగ్యనగరం.. ఘనంగా లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు..

ప్రతీకాత్మక చిత్రం

Lal Darwaza Bonalu: ఇవాళ హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ఆషాఢ మాసంలో జరిగే చివరి బోనాలు కావడంతో ఓల్డ్ సిటీ ప్రాంతం కళకళలాడుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఈ రోజు బోనాలు జరగనున్నాయి.

 • Share this:
  ఆషాఢ మాసం బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టితో నగరంలో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం.. ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి. ఇక పాతబస్తీ లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బోనాల జాతర కోసం కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశారు అధికారులు. భాగ్యనగరంలోనే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువలా సాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారన బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు.

  గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కేవలం ఇండ్ల వద్దనే మొక్కులు చెల్లించారు. ఈసారి వైరస్‌ ఉధృతి కాస్త తగ్గడంతో ప్రభుత్వం మొక్కులు చెల్లించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ప్రతి ఏటా ఆషాఢమాసం చివరి వారంలో పాతబస్తీలో బోనాల వేడుకలు జరుగనుండగా.. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాలు తీసుకువచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చివరి ఆదివారం కావడంతో దాదాపు 2 వేలకుపైగా ఆలయాల్లో ఆషాఢ మాస బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి, మీరాలం మండి మహంకాళి, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం, కార్వాన్‌ దర్బార్ మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నారు.

  ఇక సోమవారం నాడు పలు ఆలయాల్లో రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. పలహార బండ్లు, ఘటాల ఊరేగింపుతో బోనాల వేడుకల పూర్తికానున్నాయి. తెల్లవారుజామున అభిషేకం నిర్వహించగా.. అలంకరణ అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్‌ దర్వాజ సింహవాహిని ఆలయంలో సోమవారం రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు జరుగనున్నాయి. వేడుకల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ తొలి బోనం సమర్పించారు.

  రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..
  అలాగే అమ్మవారి ఊరేగింపు జ‌రిగే 19 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. పాతబస్తీలో బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. చార్మినార్‌, మీర్‌చౌక్‌, ఫలక్‌నుమా, బహదూర్‌పుర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ అమలులో ఉండనున్నాయి. కందికల్ గేట్ బాలరాజ్ గంజ్ మంచి లాల్ దర్వాజ రూట్లో ట్రాఫిక్ ను అనుమతించరు. ఓల్డ్ చత్రినాక మీదుగా గొలిపురా వైపు మళ్లిస్తారు. ఉప్పుగూడ నుంచి ఛత్రినాక వైపు నుంచి వచ్చే వెహికల్స్ ను గౌలిపురా క్రాస్ రోడ్స్ నుంచి మొగలురా పీఎస్ వైపు మళ్లిస్తారు.
  Published by:Veera Babu
  First published: