ఈ మధ్యకాలంలో మనదేశంలో లివర్ వ్యాధులు ఎక్కువై పోతున్నాయి. మారిన జీవనశైలి, కల్తీ ఆహారం కారణంగా కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ షాకింగ్ కేసు నమోదయింది. మహిళ శరీరంలో ఏకంగా 12 కేజీల లివర్ ఉండడంతో... డాక్టర్లు విజయవంతంగా దానిని తొలగించారు. 14 గంటల పాటు సుదీర్ఘంగా ఆపరేషన్ చేసి ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు. .వైద్య చరిత్రలో ఇంత పెద్ద కాలేయాన్ని తొలగించడం ఇదే మొదటిసారని వైద్యులు చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన 50 ఏళ్ల మహిళ కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతోంది. కాలేయం భారంగా ఉండడంతో నడవలేని స్థితిలోకి చేరుకుంది. ఉబ్బిన కాలేయం కారణంగా హెర్నియా కూడా ఏర్పడింది. 2019 నుండి బరువు పెరగడం ప్రారంభించింది. లివర్ మార్పిడి చేయించుకోవాలని కోల్‌కతాలోని డాక్టర్లు సూచించారు. డాక్టర్ల సూచనమేరకు ఆమె హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరింది. టెస్టులు చేసి పరిశీలించిన వైద్యులు.. రిపోర్టులను చూసి షాక్ తిన్నారు. శరీరంలో లివర్ పెరిగిపోవడాన్ని వారు గమనించారు. ఆ మహిళా రోగికి వెంటనే ఆపరేషన్ నిర్వహించి, శరీరం నుంచి 12 కిలోల బరువున్న కాలేయాన్ని తొలగించారు.
కాలేయం ఆమె పొత్తికడుపు మొత్తాన్ని ఆక్రమించిందని, దీని వల్ల ప్రేగులను స్థానభ్రంశం చేసిందని డాక్టర్లు తెలిపారు. సహజంగా లివర్ గరిష్టంగా 1.5 కిలోల బరువు ఉంటుంది. కాని అది 12 కిలోలకు చేరడం తీవ్ర అనారోగ్యాలకు దారితీసింది.
పాలిసిస్టిక్ కాలేయం, మూత్రపిండాల వ్యాధి అంటే ఏమిటి?
పాలిసిస్టిక్ కాలేయం, మూత్రపిండ వ్యాధి అనేది వంశపారంపర్యంగా వస్తుంది. జన్యువుల్లో ఉత్పరివర్తనాల కారణంగా, మూత్రపిండాలు, కాలేయంలో తిత్తులు ఏర్పడతాయి. ఈ పరిస్థితి ఉన్నవారికి 30 ఏళ్ల వరకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. తిత్తులు పెరిగేకొద్దీ, వారు లక్షణాలను అనుభవించడం ప్రారంభిస్తారు. అవి పరిమాణంలో అపారంగా పెరుగుతాయి. అయితే బొడ్డులో నీరు చేరడం, హెర్నియా, శ్వాస సమస్యలకు దారితీస్తుంది.
నిమ్స్ ఆసుపత్రిలో ముగ్గురు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, ఒక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ పెద్ద సర్జికల్ టీమ్‌తో కలిసి పశ్చిమ బెంగాల్ మహిళకు ఆపరేషన్ చేశారు. కాలేయం మొత్తం పొత్తికడుపును ఆక్రమించినందున ఆపరేషన్ చాలా కష్టంగా మారిందని కిమ్స్ వైద్యులు తెలిపారు. కాలేయాన్ని వేరు చేయడం చాలా కష్టమైన పని. సాధారణంగా కిడ్నీని మార్పిడి చేయడానికి అదనంగా కట్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఒక వ్యక్తికి రెండు అరుదైన ట్రాన్స్ప్లాంటేషన్లు చేయడంలో కిమ్స్ వైద్యులు సక్సెస్ అయ్యారు. ఇది అత్యంత సంతృప్తికరమైన ఆపరేషన్లలో ఒకటి. ఇది రోగి యొక్క జీవితాన్ని కాపాడటమే కాకుండా ఆమె శారీరక, మానసిక ఆందోళనలు, బాధలను వదిలించుకోవడానికి ఈ ఆపరేషన్ ఉపయోగపడుతుందని డాక్టర్ల బృందం అభిప్రాయపడింది. 14 గంటల పాటు సాగిన మారథాన్ ఆపరేషన్‌ను కాలేయ మార్పిడి డాక్టర్ రవిచంద్ సిద్ధాచారి విజయవంతం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.