తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Sessions) ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ఆ తర్వాత సభలు వాయిదా పడ్డాయి. ఈ ఐతే సభా ప్రారంభానికి ముందు అసెంబ్లీ లాబీల్లో సరదా సన్నివేశాలు కనిపించాయి. బీఆర్ఎస్ (BRS),బీజేపీ (BJP) సభ్యులు ఆప్యాయంగా పలకరించారు. ఒకంటరే మరకొరికి పడని వారు కూడా.. సరదాగా మాట్లాడుకున్నారు. ఐతే ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao), కడియం శ్రీహరి (Kadium Srihari) సరదాగా కలుసుకోవడం..అందరిలోనూ ఆసక్తి కలిగించింది. వీరిద్దరి మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకరిపై మరొకరు బాహాటంగానే విమర్శలు చేసుకుంటారు. అలాంటి నేతలు ఇవాళ అసెంబ్లీ లాబీల్లో కలివిడిగా కనిపించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి మధ్య సరదా సంభాషణ జరిగింది. మంత్రి ఎర్రబెల్లికి బీఆర్‌ఎస్ కండువాను కప్పారు కడియం శ్రీహరి. అంతటితో ఆకుండా..ఎర్రబెల్లిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పడంతో.. అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కడియం ఇలా అన్నారేంటని షాక్ అయ్యారు. ఆ తర్వాత కడియం నవ్వడంతో..మిగతా వారు కూడా సరదాగా నవ్వుకున్నారు.
వీరిద్దరే కాదు.. ప్రతిపక్ష పార్టీల నేతలతోనూ సరదాగా మాట్లాడారు మంత్రి కేటీఆర్ (Minister KTR).. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ వద్దకు వెళ్లి.. వారితో మాట్లాడారు. హుజూరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటల రాజేందర్‌ను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారట. ఎవరైనా పిలిస్తే కదా హాజరయ్యేది అంటూ ఈటల సమాధానం ఇచ్చారట. మధ్యలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కలగజేసుకొని..తనను కూడా పిలవడం లేదని ఫిర్యాదయ్యారట. మళ్లీ ఈటల కలగజేసుకొని.. కనీసం కలెక్టర్ అయినా ఆహ్వానించాలని అన్నారు. ఈటల వ్యాఖ్యలతో మంత్రి కేటీఆర్ నవ్వి.. ఊరుకున్నారని తెలిసింది.
ఆ తర్వాత రాజాసింగ్‌తోనూ కేటీఆర్ సరదాగా సంభాషించారు. మీరు వేసుకున్న చొక్కా కాషాయ రంగు.. కళ్లకు గుచ్చుకుంటోందని.. అది తనకు అస్సలు ఇష్టం ఉండదని అన్నారట. రానున్న రోజుల్లో మీరు కూడా కాషాయ రంగు చొక్కా వేసుకుంటారేమో.. అని రాజాసింగ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇంతలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రావడంతో.. గవర్నర్ వస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంత్రికి చెప్పారు. అనంతరం ఆయన తన ట్రెజరీ బెంచీల వైపు వెళ్లిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, Hyderabad, Local News, Telangana, Telangana Budget