HYDERABAD IN TELANGANA A HANDLOOM SCHEME SIMILAR TO RAITUBANDHU WILL BE IMPLEMENTED DETAILS HERE VB
వారికి గుడ్ న్యూస్.. రైతుబంధు తరహాలోనే మరో పథకం..! 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు అర్హులు.. వివరాలివే..
తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎంతలా విజయవంతం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ ఎస్ రెండో సారి అధికారంలోకి రావడానికి ఈ పథకం చాలా ఉపయోగపడిందని చెప్పొచ్చు. అయితే దాని తరహాలోనే మరో పథకం ముందుకు రాబోతోంది. అది ఎవరికోసమంటే..
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎంతలా విజయవంతం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలోని రైతులు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు దఫాలుగా రూ.10 వేలు ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటిసారి అధికారం చేపట్టాక మరో సంవత్సరంలో ఎన్నికలు వస్తాయనగా సిఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పథకాన్ని ప్రజలలోకి తీసుకువచ్చారు. ఒక విధంగా టిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి ఈ రైతు బంధు పథకం కూడా ఒక కారణమే అని అంటుంటారు విశ్లేషకులు. ఇక తాజాగా తెలంగాణలోని నేత కార్మికుల సంక్షేమం కోసం రైతుబంధు తరహాలో త్వరలో చేనేతబంధు పథకాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు, ఈ రంగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పరిశ్రమల శాఖకు అనుబంధ విభాగంగా ఉన్న చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి కార్యదర్శిని నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం ఈ శాఖకు కమిషనర్ హోదాలో ఉన్న అధికారి పనిచేస్తుండగా పరిశ్రమల శాఖ నుంచి విభజన తర్వాత కార్యదర్శి హోదాలో అధికారిని నియమించేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపెరల్ పాలసీ (టీ–టాప్)ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ తరహా మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు చేనేత బంధు పథకం మార్గదర్శకాలకు చేనేత విభాగం తుదిరూపు ఇచ్చినట్లు తెలియవచ్చింది. 18 నుంచి 59 ఏళ్ల వయసుగల సుమారు 70 వేల మందికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఇప్పటికే నేత కార్మికుల వివరాలను అధికారులు సేకరించారు. సహకారేతర రంగం వారికి కూడా చేనేతబంధు పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. త్వరలో చేనేత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అలాగే నేతన్నకు చేయూత పథకం నేత కార్మికుల పొదుపు కోసం ఉద్దేశించింది. ఈ పథకం కింద కార్మికులు తమ వంతు వాటాగా 8 శాతం నిధులు జమ చేస్తే పరిశ్రమలశాఖలోని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం మరో 16 శాతం నిధులను జోడించనుంది. ఈ పథకం కోసం ప్రస్తుత వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 338 కోట్లు కేటాయించగా నాలుగు రోజుల క్రితం ఈ పథకానికి మరో రూ. 30 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకంపై ఆసక్తి ఉన్న కార్మికులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తమ వివరాలు నమోదు చేసుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఈ పథకం కింద 26 వేల మందికిపైగా కార్మికులు పేర్లు నమోదు చేసుకొని రూ. 31 కోట్లు పొదుపు చేయగా ప్రభుత్వం రూ. 62 కోట్లు తన వంతు వాటాగా చెల్లించింది. మూడేళ్ల తర్వాత కార్మికులు రూ. 50 వేల నుంచి రూ. 1.25 లక్షల వరకు రుణం తీసుకొనే వెసులుబాటు ఉండగా కరోనా నేపథ్యంలో గతేడాది మేలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి కార్మికులకు నిధులు విడుదల చేసింది.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ‘నేతన్నకు చేయూత’పథకాన్ని నుడు తిరిగి ప్రారంభించనున్నారు. ఇక ఈ చేనేత బంధు పథకం ద్వారా నేతన్నలకి ఆర్ధిక వెసులుబాటు కల్పించడంతో పాటు నేతన్నల ఓట్లు సైతం తమ ఖాతాలోకి మార్చుకునే వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.