వాళ్ల వయస్సు 35 ఏళ్లు.. 30 రోజుల్లో 8 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం.. హైదరాబాద్ మహిళల ఘనత.. పూర్తి వివరాలను తెలుసుకోండి..

ఘనత సాధించిన హైదరాబాదీలు (Image credit : facebook)

Hyderabad Cyclists: ఒకే పని పదే పదే చేయాలంటే ఎవరికైనా విసుగు వస్తుంది. అందులోనూ వర్కౌట్ విషయంలో రోజూ అదే వ్యాయామం చేయాలంటే.. ఏమాత్రం ఆసక్తికరంగా ఉండదు. కానీ హైదరాబాద్‌కు చెందిన మహిళా సైక్లిస్టులు మాత్రం ఒకే పనిని 30 రోజులుగా చేస్తూ అరుదైన ఘనత సాధించారు.

  • Share this:
ఒకే పని పదే పదే చేయాలంటే ఎవరికైనా విసుగు వస్తుంది. అందులోనూ వర్కౌట్ విషయంలో రోజూ అదే వ్యాయామం చేయాలంటే.. ఏమాత్రం ఆసక్తికరంగా ఉండదు. కానీ హైదరాబాద్‌కు చెందిన మహిళా సైక్లిస్టులు మాత్రం ఒకే పనిని 30 రోజులుగా చేస్తూ అరుదైన ఘనత సాధించారు. సైకిల్‌పై నెక్లెస్ రోడ్డు వలయం చూట్టూ రోజుకు 8 నుంచి 10 గంటల పాటు తిరిగారు. ఈ సైక్లింగ్ ద్వారా 30 రోజుల పాటు అదే వలయంలో 8812 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసి రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ప్రియాంక జైన్, రాజీ కృష్ణ ఆర్ నాయర్, నిర్మితా ఘియా అనే మహిళలు గత మూడేళ్ల నుంచి సైకిల్‌పై ప్రయాణాలు చేస్తున్నారు. వీరందరూ సైక్లింగ్‌ను ఒక హాబీగా మార్చుకున్నారు. దీంతో పాటు హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూపులో భాగమయ్యారు. ఈ ఏడాది జూన్ 20 నుంచి జులై 21 వరకు ప్రతిరోజు ఈ ముగ్గురు మహిళలు నెక్లెస్ రోడ్డు వలయం (Loop) చుట్టూ సైక్లింగ్ చేశారు.

ఈ లూప్‌లోనే 30 రోజుల్లో 8812 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశారు. ఇది హైదరాబాద్ నుంచి కేప్‌టౌన్ వరకు ఉన్న దూరంతో సమానం కావడం గమనార్హం. గతేడాది కొంతమంది మహిళలు సైకిల్‌పై సుదూర ప్రాంతాలకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ వీరు మాత్రం ఏదైనా విభిన్నంగా చేయాలని ప్రేరణ పొంది ఈ సవాల్‌ను స్వీకరించారు. "దాదాపు మూడు సంవత్సరాలుగా సైక్లింగ్ చేస్తున్నప్పటికీ ఈ సారి మాకు మేము సవాలును నిర్దేశించుకున్నాం. దూరంగా వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ సైక్లింగ్ ద్వారా వేలాది కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. నెక్లెస్ రోడ్డు దగ్గరగా ఉన్నందున అక్కడ ముగ్గురం ఒకే వలయంలో సైక్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం" అని వివరించారు బృందంలో ఒకరైన ప్రియాంక. 35 ఏళ్లు పైబడిన ఈ ముగ్గురు ప్రతిరోజూ కనీసం 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కొన్ని రోజులు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు సైకిల్ తొక్కితే, మరికొన్ని రోజులు మధ్యాహ్నం ప్రారంభమై అర్ధరాత్రి వరకు సైక్లింగ్ చేశారు. సైక్లింగ్ ప్రారంభించిన రెండు, మూడు రోజులు తర్వాత పోలీసులు వీరిని అనుమానించడం మొదలుపెట్టారు. ఇదే లూప్‌లో సైక్లింగ్ ఎందుకు చేస్తున్నారని అడిగారు. అయితే ఇది ఓ పోటీ కోసం పోలీసులకు వివరించారు. అనంతరం పోలీసులు సైతం వీరి భద్రతను చూసుకోవడమే కాకుండా.. ట్రాఫిక్‌ను నియంత్రించి సపోర్ట్ ఇచ్చారు. ఇద్దరు పిల్లలు ఉన్న ఈ ముగ్గురు మహిళలకు వారి కుటుంబాలు కూడా మద్దతుగా నిలిచాయి. ఎండ, వర్షం, గాలులు ఇలా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సైక్లింగ్ చేసినట్లు వారు తెలిపారు. వర్కవుట్స్‌లో సైక్లింగ్ ప్రాధాన్యం గురించి చెప్పేందుకే ఈ ప్రయత్నం చేశామని ఈ మహిళలు వివరించారు.
Published by:Veera Babu
First published: