ఫిబ్రవరి 17న ప్రారంభం కానున్న తెలంగాణ నూతన సచివాలయ భవనానికి రాష్ట్ర పోలీసులు పటిష్ట భద్రత కల్పించనున్నారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం చర్చించారు. మూడు కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీసులు, 300 మంది నగర పోలీసులు సచివాలయ భవన భద్రతను చూసుకుంటారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసుల నుంచి 22 మంది సిబ్బందిని కేటాయించారు. బ్యాగేజీ స్కానర్లు, వాహన స్కానర్లు, బాడీ స్కానర్లు వంటి భద్రతా పరికరాలను వినియోగించనున్నారు.
సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టులను అధికారులు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మొత్తం 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ప్రత్యేక గుర్తింపు కార్డుల ద్వారా సందర్శకుల పర్యవేక్షణ జరుగుతుంది. సచివాలయ భవనంలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లతో పాటు 34 మంది సిబ్బందితో రెండు ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరో అంతస్తు మినహా అన్ని అంతస్తుల్లో సందర్శకులను అనుమతిస్తారు.
ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎంఏయూడీ) అరవింద్ కుమార్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, సీపీ సీవీ ఆనంద్, ఎస్పీఎఫ్ డీజీ ఉమేష్ షరాఫ్, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ అనిల్ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సచివాలయ సముదాయంలో 9.42 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో 560 కార్లు, 900కు పైగా ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Hyderabad, Local News, Telangana new secretariat