మన కష్టాలే వారికి కాసులు. మన బాధలే వారికి బహుమతులు. మన సమస్యను వారి సౌకర్యంగా మార్చుకొని డబ్బులు దండుకోవడంలో కొందరు నకిలీ జ్యోతిష్యులు సిద్ధహస్తులు. అలాంటి ఓ కన్నింగ్ జ్యోతిష్యుడిని నిండా నమ్మి అడ్డంగా మునిగిందో మహిళ. అసలేం జరిగిందంటే.. పంజాబ్‌కి చెందిన 38 ఏళ్ల లలిత్.. తన తండ్రి ద్వారా జ్యోతిష్య కిటుకులు తెలుసుకున్నాడు. హైదరాబాద్‌కి వలస వచ్చి.. పెద్ద జ్యోతిష్యుడిలా బిల్డప్ ఇస్తూ.. ఆన్లైన్లో దుకాణం తెరిచాడు. ఆ తర్వాత గూగుల్‌లో లవ్ ఆస్ట్రాలజర్ గోపాల శాస్త్రి పేరుతో యాడ్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు.
జ్యోతిష్యులను నమ్మేవారు క్రమంగా ఇతని యాడ్ చూసి.. ఇతను బాగా చెబుతాడని నమ్మి.. జ్యోతిష్యం చెప్పించుకోవడం మొదలుపెట్టారు. ఆన్లైన్లో కనిపించే నంబర్‌కి ఫోన్ చేసి.. తమ జాతకం చెప్పించుకునేవారు. వారి రాశి ఏదో తెలుసుకొని.. కొన్ని మాటలు చెప్పి.. పరిహారాలు చెయ్యాలంటూ.. వారి నుంచి భారీగా ఫీజు వసూలుచేసేవాడు.
కొన్నాళ్ల తర్వాత ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా అకౌంట్లు తెరిచాడు. అక్కడ కూడా బిల్డప్ ఇచ్చాడు. కస్టమర్లు పెరిగారు. రెండు చేతులా డబ్బు రావడం మొదలైంది. ఈ పరిస్థితుల్లో.. ఓ మహిళ.. ఈ సంవత్సరం ఆగస్ట్‌లో అతనికి కాల్ చేసింది. "చెప్పండమ్మా ఏమిటి మీ సమస్య" అంటూ మాట్లాడి.. "పెద్ద సమస్యే" అన్నాడు. ఇందుకు ప్రత్యేక పరిహారాలు చెయ్యాలంటూ.. రూ.32వేలు తీసుకున్నాడు. ఆ అమ్మాయకురాలు అతన్ని పూర్తిగా నమ్మింది. డబ్బు పోతే పోయింది.. సమస్య పరిష్కారమైతే చాలనుకుంది.
అడిగినంతా ఇవ్వడంతో... మంచి సౌండ్ పార్టీలా ఉంది అనుకున్న లలిత్.. ఆమె నుంచి మరింత లాగేయాలని నిర్ణయించుకున్నాడు. చంద్ర గ్రహణం, శనిదోషం, గ్రహ గోచారం.. ఇలా రకరకాల కారణాలు చెబుతూ.. వాటికి పరిహారాలు చెయ్యాలంటూ.. ఆమె దగ్గర లక్షలు వసూలు చేశాడు. చిత్రమేంటంటే.. ఆమె అతను అడిగినంతా ఇస్తూపోయింది. చివరకు 3 నెలల్లో రూ.47.12 లక్షలు సమర్పించింది. అప్పటికి గానీ ఆమెకు మోసపోతున్న విషయం అర్థం కాలేదు.
వెంటనే ఆమె అక్టోబర్ 19న హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని కలిసి విషయం చెప్పింది. చాలా ఆలస్యం అయ్యిందన్న పోలీసులు.. డోంట్ వర్రీ అంటూ ధైర్యం చెప్పి.. పక్కా సమాచారంతో.. లలిత్‌ని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో డిటెక్టివ్ టీమ్ కూడా పాల్గొంది. ఈ లలిత్ ఇంకా ఎంతమందిని ముంచాడో తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇలాంటి నకిలీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Hyderabad, North telangana