వరకట్నం, అదనపు కట్నం కోసం ఆడవాళ్ల ఉసురు తీస్తున్న సంఘటనలు ఈమధ్యకాలంలో మరింత పెరిగాయి. హైదరాబాద్(Hyderabad)ఎల్బీనగర్ పోలీస్(police station) స్టేషన్ పరిధిలో ఓ లేడీ డాక్టర్(Lady Doctor)మృతి స్థానికంగా కలకలం రేపింది. సూర్యోదయనగర్(Suryodayanagar)లో నివాసముంటున్న 31సంవత్సరాల భారతి (Bharthi)ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. భర్త ద్వారా భారతి చనిపోయిన వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకొని బిడ్డను చూసి బోరున విలపించారు. భారతి విషం తాగి సూసైడ్(Suicide) చేసుకుందని ఆమె భర్త రమేష్(Ramesh), అత్తమామలు పోలీసులకు తెలియజేశారు. కూతురు మరణవార్త తెలుసుకున్న భారతి తల్లిదండ్రులు అబద్దం అంటున్నారు. కేవలం అదనపు కట్నం(Extra dowry) కోసం తమ బిడ్డ భారతిని మెట్టినింటి వాళ్లు వేధించారని..డబ్బులు తేవాలని పదే పదే మానసికంగా హింసించడం వల్లే చనిపోయిందని ఆరోపించారు. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టే ఉన్నత చదువు చదివిన తమ బిడ్డ ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదన్నారు.
పెళ్లై ఆరు నెలలు కూడా కాలేదు..
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కి చెందిన భారతికి గతేడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన పిల్లల డాక్టర్ కొండగట్టు రమేష్‌తో వివాహం జరిపించారు పెద్దలు. వివాహ సమయంలో వరుడు కోరినట్లుగా భారీగా కట్నకానుకలు ముట్టజెప్పారు మృతురాలి తల్లిదండ్రులు. ఎకరం పొలం, 5లక్షల నగదు, 20తులాల గోల్డ్‌ని వరకట్నంగా ఇచ్చారు. పెళ్లైన కొద్ది రోజుల వరకు భారతి కాపురం సజావుగానే సాగింది. అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాబ్ చేస్తున్న రమేష్ సొంతంగా ఆసుపత్రి పెడదామని భారతిని పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మని బలవంతం చేశాడు. డబ్బు కోసం గత కొద్దిరోజులుగా భారతిని మరింత వేధించినట్లుగా ఆరోపించారు మృతురాలి పేరెంట్స్. మద్యం తాగొచ్చి తిట్టేవాడని, ఇంట్లో ఆమెతో సరిగా మాట్లాడకుండా మానసిక క్షోభకు గురి చేశాడని అల్లుడు రమేష్‌పై ఆరోపణలు చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు.
అదనపు కట్నం కోసం వేధింపులు..
అదనపు కట్నం కోసం భర్త రమేష్ పెట్టే వేధింపులు భరించలేకపోయిన భారతి 15రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భారతితో పాటు రమేష్‌కి సర్ధి చెప్పి పంపారు. పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత శుక్రవారం భారతికి ఫోన్ చేశారు తల్లిదండ్రులు. ఆమె ఫోన్ స్పందించకపోవడంతో శనివారం రమేష్ ఫోన్ చేశారు. క్షేమసమాచారం కొనుక్కున్న కొద్ది సేపటికే భారతి సూసైడ్ చేసుకుందని అల్లుడు రమేష్ ఫోన్ చేసి చెప్పడంతో షాక్ తిన్నారు మృతురాలి తల్లిదండ్రులు.
వేధింపుల వల్లే చనిపోయిందనే ఆరోపణ..
డాక్టర్ భారతిది ఆత్మహత్య కాదని..ముమ్మాటికి హత్యేనంటున్నారు ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు. ఆత్మహత్య చేసుకుంటే గది తలుపులు వేసుకునేదని, విషం తాగితే ఆ బాటిల్ అక్కడే గదిలోనే ఉండాలని అవేమి లేకుండా విగతజీవిగా పడి ఉందంటే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు బంధువులు ఆరోపించారు. మృతురాలి బంధువులు, తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లుడు రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వరకట్న వేధింపులు తాళలేకే భారతి సూసైడ్ చేసుకుందా లేక మరేదైనా సమస్యతో ప్రాణాలు తీసుకుందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dowry harassment, Hyderabad, Women suicide