Home /News /telangana /

HYDERABAD HYDERABAD LACQUER BANGLES AND TANDOOR PULSES ARE LIKELY TO GET GEOGRAPHICAL IDENTIFICATION SOON PRV

GI: మన హైదరాబాద్ లక్క గాజులు, తాండూర్​ పప్పుకు భౌగోళిక గుర్తింపు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణకు మరో గుర్తింపు లభించనుంది. ఇప్పటికే హైదరాబాదీ హలీమ్‌కు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించగా ఇపుడు మరో గుర్తింపు లభించే అవకాశం ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  తెలంగాణకు (Telangana) మరో గుర్తింపు లభించనుంది. ఇప్పటికే హైదరాబాదీ హలీమ్‌కు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించగా.. తాజాగా ‘లక్క’ గాజులు (Hyderabad lacquer bangles) కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. పాత నగరంలోని ‘లాడ్ బజార్’ లో లభించే లాక్ బ్యాంగిల్స్‌నే తెలుగులో లక్క గాజులుగా పిలుస్తుంటారు. అందమైన రంగుల్లో మెరిసిపోతూ, అత్యంత సున్నితంగా చేతులతో చేయబడే ఈ గాజులు కేవలం లాడ్ బజార్‌లోనే దొరుకుతాయి. అందుకే దీనికి జీఐ (భౌగోళిక గుర్తింపు) ట్యాగ్ కావాలంటూ చెన్నైలోని జీఐ రిజిస్ట్రీలో దరఖాస్తు చేశారు. అంతేకాకుండా  తెలంగాణకు చెందిన మరో ఉత్పత్తికి కూడా జీఐ (geographical identification) గుర్తింపు లభించే అవకాశం ఉన్నది. తాండూరు రెడ్‌ గ్రామ్‌కు (పప్పు) భౌగోళిక గుర్తింపు కోసం అవసరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుర్తింపు దక్కితే ఈ రెండు ఉత్పత్తులకు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ లభించే వీలు కలుగుతుంది.

  500 ఏళ్లుగా..

  ఎంతో క్లిష్టమైన లక్క గాజులను గత 500 ఏళ్లుగా కొన్ని కుటుంబాలు తరాల నుంచి లాడ్ బజార్‌లో తయారు చేస్తున్నారు. లక్కను కరిగించి గుండ్రంగా మలిచి.. వాటిపై అందమైన రంగు రాళ్లు, క్రిస్టల్స్, బీడ్స్, మిర్రర్స్ వంటివి అతికిస్తారు. చూడగానే ఆకర్షణీయంగా కనపడే ఈ లాక్ బ్యాంగిల్స్ కోసం దేశ, విదేశాల నుంచి ఎంతో మంది లాడ్ బజార్‌కు వస్తుంటారు. జీఐ ట్యాగ్ ఉండటం వల్ల లాక్ బ్యాంగిల్స్‌ను మరింత ఎక్కువగా ప్రచారం చేయడానికి వీలుంటుంది.  హైదరాబాదీ హలీమ్ నగరం నుంచి తొలి జీఐ ట్యాగ్ పొందింది. హైదరాబాదీ బిర్యానీ జీఐ ట్యాగ్ కోసం ప్రయత్నించినా.. విఫలం అయ్యింది. తెలంగాణలో బంగనపల్లి మామిడిపండ్లు, పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ జరీ వర్క్, నిర్మల్ బొమ్మలు, పెయింటింగ్స్, టాయ్స్, గద్వాల్ చీరలు, సిద్దిపేట గొల్లబామ, చెరియాల్ పెయింటింగ్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, అదిలాబాద్ దోక్రా, వరంగల్ దర్రీస్, తెలియా రుమాళ్లు, నారాయణపేట నేత చీరలు జీఐ ట్యాగ్ సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్‌ లక్క గాజులకు సంబంధించిన దరఖాస్తును ఇటీవలే సమర్పించారు. తాండూరు రెడ్‌ గ్రామ్‌ (tandoor pulses) దరఖాస్తు జీఐ వద్ద పరిశీలనలో ఉన్నది. మరో ఆరు నెలల్లో దీనికి జీఐ గుర్తింపు లభించే వీలున్నది.

  స్వతంత్ర భారత వజ్రోవత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలు అత్యధికంగా ఇష్టపడే జీఐ ఉత్పత్తిని ఎంపికచేసేందుకు ఆన్‌లైన్‌ పోలింగ్‌ను చేపట్టింది. దీనివల్ల జీఐ ఉత్పత్తులకు ప్రచారం లభించడంతోపాటు ప్రజల్లో సైతం వీటిపై మరింత చైతన్యం కలిగే అవకాశం ఉన్నది. ipindiaservices.gov.in/girpoll వెబ్‌సైట్‌ ద్వారా పోలింగ్‌లో పాల్గొనవచ్చు. పోలింగ్‌కు అక్టోబర్‌ రెండు చివరి తేదీ. దీని ఆధారంగా అత్యధికంగా ఇష్టపడుతున్న జీఐ ఉత్పత్తిని ఎంపిక చేస్తారు.

  జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ అంటే ..?

  జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ అనేది ఒక గుర్తు, చిహ్నం. ప్రత్యేక భౌగోళిక స్థానం నుంచి వచ్చే ఉత్పత్తికి ఉపయోగించే పేరు. గొప్ప పేరు, తరతరాలుగా తిరస్కరించలేని చారిత్రక వారసత్వంతో ప్రత్యేక, నిర్దిష్ట లక్షణాన్ని కలిగి ఉన్న వస్తువులకు ఈ గుర్తింపు ఇస్తారు. సహజ ఉత్పత్తి, హస్తకళ, ఆహార పదార్థాలు, తయారుచేసిన ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి ఇలా అనేక వస్తువులకు ఈ గుర్తింపు లభిస్తుంది. గత 15 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 920 కిపైగా వస్తువులకు దరఖాస్తులు చేసుకోగా, 400లకుపైగా ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించింది.

  డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) ఆధ్వర్యంలో ఈ గుర్తింపు ఇస్తారు. చెన్నైలో జీఐ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. జీఐ గుర్తింపుతో డార్జిలింగ్‌ టీ, పాష్మినా షాల్‌, కన్నౌజ్‌ పెర్ఫ్యూమ్‌, పోచంపల్లి ఇక్కత్‌ తదితర వాటికి అంతర్జాతీయ మార్కెట్‌ లభించింది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు