గురువారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. అయితే ఇదే మాసంలో... శ్రీరామనవమి పండగతో పాటు. హనుమాన్ జయంతికూడా వస్తుంది. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం సిటీ పోలీస్ అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగల వేళ నిర్వహించే ర్యాలీలకు సంబంధించి అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ర్యాలీలు వెళ్లే.. ఆయా రూట్లను తనిఖీ చేయాలని సూచించారు.
రద్దీతో భక్తులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆయా మతాలకు చెందిన ప్రార్థన కేంద్రాల వద్ద ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పండుగల వేళ సిబ్బంది మరింత ఎక్కువగా సమయం పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. సంఘ విద్రోహ శక్తులపై నిఘాను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో పాటు సోషల్‌మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు, పోస్టులపై నిఘా పెట్టాలన్నారు. అవసరమైతే కేసులు నమోదు చేయాలని అధికారుల్ని సీవీ ఆనంద్ ఆదేశించారు. ఉరేగింపులను దగ్గరుండి పర్యవేక్షించాలని, కమ్యూనల్ రౌడీస్, అనుమానితులను బైండోవర్ చేయాలని చెప్పారు.
అలాగే సిబ్బంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీవీ ఆనంద్. పోలీస్ సిబ్బంది డైట్, వ్యాయామం చేస్తూ పిట్‌కాప్ యాప్ నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. భోజనానికి బియ్యం కాకుండా, ప్రతి రోజు చిరుధాన్యాలను అలవాటుగా చేసుకోవాలని సూచించారు. డి-కామో(డ్రోన్స్ అండ్ కెమెరా మెయింటెనెన్స్ అర్గనైజేషన్)తో సమన్వయం చేసుకొని పోలీస్‌స్టేషన్ల వారీగా సీసీటీవీలను మరమ్మతులు చేయించాలని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad police, Local News, Telangana News