లెమన్‌ట్రీ హోటల్‌ ఘటన.. ఆ విషయంలో గొడవ!.. రూమ్‌లో మూడో వ్యక్తి ఉన్నాడా..?

హోటల్ గదిలో శవాలుగా కనిపించిన ప్రేమికులు

హైదరాబాద్ మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో జరిగిన ప్రేమికుల ఆత్మహత్య, హత్య కేసు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగిందనే ప్రశ్న.. ఇప్పుడు వెంటాడుతోంది.

 • Share this:
  హైదరాబాద్ మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో జరిగిన ప్రేమికుల ఆత్మహత్య, హత్య కేసు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగిందనే ప్రశ్న.. ఇప్పుడు వెంటాడుతోంది. పోలీసులకు కూడా ఈ కేసు సవాలుగా మారింది. వివరాలు.. లెమన్ ట్రీ హోటల్‌లో గురువారం సాయంత్రం ఓ యువతిని హత్య చేసిన యువకుడు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరిని నారాయణపేట జిల్లా హకీంపేటకు చెందిన జి.రాములు (25), వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం లగచర్లకు చెందిన ఈడిగి సంతోషి (25)గా గుర్తించారు. వీరిద్దరు హకీంపేట జెడ్పీ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురుచింది. అయితే కులాలు వేరు కావడంతో ఇద్దరి కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో తాము విడిపోతామని.. రాములు, సంతోషి చెప్పారు. పైకి అలా చెప్పినప్పటికీ వారు తరుచూ కలుస్తూనే ఉన్నారు.

  ఇక, కోచింగ్ కోసమని చెప్పి సంతోషి.. వారం రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చింది. మరోవైపు రాములు కారు నడిపే పని నిమిత్తం జూలై 26న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు బుధవారం మధ్యాహ్నం లెమన్ ట్రీ హోటల్‌లో రూమ్ నెంబర్ 317ని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం బయటకు వెళ్లి.. గంట సేపటి తర్వాత తిరిగి వచ్చారు. ఇక, గురువారం హోటల్ గది చేయాలని చెప్పేందుకు వెళ్లగా.. వారిద్దరు గొడవ పడుతుండటం చూసినట్టుగా హోటల్ సిబ్బంది చెప్పారు.

  అయితే వీరిద్దరు అనుకునే హైదరాబాద్‌కు వచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇక, నెలన్నర రోజుల కిందే ప్రేమ వివాహం చేసుకున్నా.. కుటుంబాలకు తెలియకుండా ఉంచారు. తాజాగా పెళ్లి విషయాన్ని తమ కుటుంబాలకు చెప్పే విషయమై ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవకు దారితీసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రాములు.. బ్లేడుతో సంతోషి గొంతును కోసి ఆ తర్వాత తాను కూడా కోసుకన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అనంతరం చనిపోతానో.. లేదో అనే అనుమానంతో అతడు ఉరివేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

  ఇక, సంతోషి సోదరుడు రాఘవేందర్ మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం సోదరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందని అన్నాడు. అయితే తమకేలాంటి అభ్యంతరం లేదని చెప్పానని తెలిపాడు. అయితే రాములు ఇంట్లో ఒప్పుకోవడం లేదని సంతోషి ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పాడు. అయితే వారిద్దరు పెళ్లి చేసుకున్న విషయం తమకు తెలియదని అన్నాడు. హోటల్ గదిలో మూడో వ్యక్తి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశాడు. అయితే బంధువుల వద్ద కూడా పూర్తి సమాచారం లేకపోవడంతో.. వారిద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారనేది చేధించడం పోలీసులు సవాలుగా మారిందని చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనా పోలీసుల విచారణ తర్వాత.. ఈ కేసుకు సంబంధించిన అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి.
  Published by:Sumanth Kanukula
  First published: