రాడిపన్ బ్లూ పబ్ కేసు వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. రాడిసన్ బ్లూ హోటల్‌లోని పబ్‌లో మొన్నరాత్రి పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్టులు, దాడులు వెనుక అనేక ఆరోపణలు వస్తున్నాయి. పబ్‌లో డ్రగ్స్ వాడుతున్నరాన్న సమాచరంతో టాస్క్ ఫోర్స్ అధికారులు ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై దాడులు చేశారు. అయితే ఈ కేసులో పోలీసుల తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయ. పబ్‌లో ఉన్నవారందర్నీ కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
148 మందిని అదుపులోకి తీసుకోవడం.. ఏడుగంటల పాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్టేషన్‌లో ఉంచడం ఆ తర్వాత వదిలేయడంపై అనేకమంది ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో పలువురు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్‌కు ముందు ఎలాంటి కసరత్తు చేయలేదని, ఆపరేషన్ తర్వాత బ్యాకప్ ప్రోగ్రామ్ ఏమిటనే ప్రణాళిక లేకుండా.. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. పబ్‌లో ఉన్న విదేశీ మహిళలను కూడా స్టేషన్‌కు తీసుకురావడంతో ‘అన్ ప్రొఫెషనల్’ పోలీసింగ్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే పబ్‌లో బర్త్ డే పార్టీ ఏం జరగలేదన్నారు. ఐదారుగురు మాత్రమే పార్టీ చేసుకున్నారన్నారు. మిగిలినివారంతా ఎవరికి వారు.. తమ స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చారన్నారు. బర్త్ డే పార్టీతో మిగతావారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పబ్‌కు వెళ్లడం తప్పు, నేరం కాదని యువతీ యువకులు వాపోయారు. ఎవరో చేసిన తప్పును కారణంగా చూపుతూ పబ్‌లో ఉన్నవారందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడం దారుణం అని ఆరోపించారు. ఎంత సేపు పోలీస్ స్టేషన్‌లో ఉంచుతారు? అంటూ ఓ యువతి పోలీసులను ప్రశ్నిస్తే.. అక్కడున్న ఓ కానిస్టేబుల్ బూతులు తిట్టాడని కూడా కొందరు యువతులు ఆరోపించారు. నోటితో చెప్పలేని విధంగా ఆ కానిస్టేబుల్స్ మాట్లాడారని వాపోయారు. ఒకరిద్దరు కానిస్టేబుళ్లు ఇలా ప్రవర్తించారన్నారు. దీంతో ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన ఆ యువతి కంటతడి పెట్టిందని వివరించారు.
తప్పు చేసిన వారిని ఎంతటివారైనా శిక్షించాల్సిందే.. కానీ.. ఎలాంటి తప్పు చేయని అమాయకుల్ని ఇలా స్టేషన్‌లలో గంట గంటలు కూర్చోబెట్టడం ఏంటని పబ్‌కు వచ్చిన యువకులు, అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. తాము డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానాలుంటే.. రక్త నమూనాలు తీసుకోవాలని కోరామన్నారు. కానీ పోలీసులు అసలు పోలీసులు ఆ దిశలో ఎలాంటి ప్రయత్నాలే చేయలేదన్నారు. పై అధికారులు చెప్పేదాకా వెయిట్ చేయాలన్నారు. దాడులు చేశాక.. తర్వాత ఏం చేయాలి అనే ప్లానింగ్ లేకుండానే అందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారని వాళ్లంతా వాపోయారు. ఉదయం 7 గంటల నుంచి ఒక్కొక్కరి వివరాలు తీసుకుని, పంపించారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drugs case, Hyderabad, Telangana Police