కొన్ని ప్రేమజంటలను చూస్తుంటే గొప్ప ప్రేమకథలు విషాదంగానే ముగుస్తాయనే సినిమా డైలాగు(Movie dialogue) నిజమే అనిపిస్తుంది. సూపర్ మార్కెట్(Supermarket)లో ఏర్పడిన పరిచయం వాళ్లను ప్రేమ పేరుతో ఆర్యసమాజ్(Arya Samaj)వరకు నడిపించింది. తమ ఇష్టాన్ని అంగీకరించని పెద్దలను సైతం వద్దనుకుంది. సమాజంలో పరిపూర్ణమైన దంపతులుగా జీవించాల్సిన వాళ్లకు అంతలోనే వైవాహిక బంధంపై విరక్తి పుట్టింది. ఆ మనస్తాపంతో వాళ్లిద్దరూ చేసిన పని అందర్ని షాక్‌కు గురి చేసింది.
నాలుగేళ్ల ప్రేమ ..
హైదరాబాద్ రామాంతాపూర్‌లోని శ్రీనగర్‌కి చెందిన 30సంవత్సరాల కొత్త సాయిగౌడ్ అనే యువకుడు నాలుగేళ్ల క్రితం మౌలాలిలోని సూపర్ మార్కెట్లో ఓ యువతిని చూశాడు. మీర్‌పేటకు చెందిన సందూర్ నవనీత అనే 28సంవత్సరాల అమ్మాయితో సాయికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మాట్లాడుకోవడం, తరచూ కలుసుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమపుట్టింది. ఇలా నాలుగేళ్లు ఒకరంటే మరొకరికి విడదీయలేనంతగా ఇష్టం ఏర్పడింది. ఈక్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సాయిగౌడ్, నవనీత కులాలు వేరు కావడంతో వాళ్ల ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు.
4నెలల కాపురంతో విరిగిపోయింది..
కుటుంబ సభ్యుల కంటే ప్రేమే ముఖ్యమంత్రి భావించింది జంట. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 10న ఆర్యసమాజ్‌లో సాయిగౌడ్ నవనీతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమను జయించిన ఈ జంట పెద్దల మనసుల్లో చోటు సంపాధించుకోలేకపోయింది. ఫలితంగా ఇద్దరూ రామాంతాపూర్‌లోని శ్రీనగర్ కాలనీలో వేరు కాపురం పెట్టారు. నవనీత ప్రైవేట్ కాల్ సెంటర్లో జాబ్ చేసింది. సాయిగౌడ్ పెస్ట్ కంట్రోల్ ఉద్యోగం చేసేవాడు. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత నుంచే సాయిగౌడ్ ఉద్యోగం పోయింది. దాంతో మద్యానికి అలవాటుపడ్డాడు. తరచూ ఇంటికి మద్యం తాగి వస్తుండటంతో నవనీత నిలదీసింది. ఈవిషయంలోనే ఇద్దరూ గొడవలు పడుతూ ఉండేవారు.
సమస్యలు తట్టుకోలేక..
భర్త ఉద్యోగం చేయకుండా మద్యానికి బానిసైన విషయాన్ని నవనీత తల్లిదండ్రులకు చెప్పింది. కేవలం నవనీత సంపాదనతో కుటుంబ పోషణ గడవడం కష్టంగా మారింది. కొత్తగా కాపురం మొదలుపెట్టిన ప్రేమజంట ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోయింది. శుక్రవారం సాయంత్రం నవనీతకు పుట్టింటి వాళ్లు ఫోన్ చేశారు. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో శనివారం ఆమె సోదరుడు నవీన్ రామంతాపూర్‌లోని సోదరి ఇంటికి వచ్చాడు. ఇంట్లో సాయిగౌడ్, నవనీత ఇద్దరూ శవాలుగా కనిపించడం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.
సమాజంలో బ్రతకలేక..
మృతురాలి సోదరుడు ఇచ్చిన సమాచారం మేరకు స్పాట్‌కి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సాయిగౌడ్, నవనీతలో మొదటగా నవనీత ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లుగా నిర్ధారించారు. ఆ తర్వాత భర్త సాయిగౌడ్ ఆమె చున్నీతో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తేల్చారు. చనిపోవడానికి కారణాలు రాబట్టేందుకు స్థానికుల ద్వారా పూర్తి వివరాలు సేకరించారు పోలీసులు. ప్రేమలో సక్సెస్ అయిన సాయిగౌడ్, నవనీత ఫ్యామిలీ లైఫ్‌లో ఫెయిల్ కావడం అందర్ని విస్మయానికి గురి చేసింది. నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతంగా ముగించుకోవడం చూసి విచారం వ్యక్తం చేశారు కాలనీవాసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Love marriage, Lovers suicide