ఈ ఏడాది ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ వేసవిలో ఎండలు మండిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే వేసవి ప్రారంభం అవుతుందనే సంకేతాలు వచ్చాయి. వచ్చే వారం పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని, వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన వేడి తరంగాలు, బలహీనమైన రుతుపవనాలతో సంబంధం ఉన్న ఎల్ నినో ఈ ఏడాది ఏర్పడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 11 నుండి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం ప్రారంభిస్తాయి. అక్కడి నుంచి వేసవి కాలం ప్రారంభం అవుతుంది. అయితే గత వారం ఫిబ్రవరి వరకు రాత్రులు, ముఖ్యంగా తెల్లవారుజామున చల్లటి వాతావరణం నెలకుని ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తరణి బాలాజీ వెల్లడించారు.
గత తొమ్మిదేళ్లలో, వార్షిక గరిష్ట ఉష్ణోగ్రతలు 2016లో అత్యధికంగా, 2021లో అత్యల్పంగా నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం, ప్రస్తుతం లా నినో పరిస్థితుల కారణంగా గత మూడేళ్లలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. ఎల్ నినో ప్రభావం వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది భారతదేశంలో కరువు లేదా బలహీన రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటుంది. మరోవైపు, లా నినో తీవ్రమైన రుతుపవనాలు, చల్లని శీతాకాలాలతో ముడిపడి ఉంది. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
ఈ సంవత్సరం ఎల్ నినో కారణంగా వేసవి తీవ్రంగా ఉంటుందని బాలాజీ అంచనా వేస్తున్నారు. వేసవి తుఫానులు, వేడి తరంగాలు, రుతుపవనాలకు ముందు ఉరుములతో కూడిన తుఫానుల తీవ్రతను నిర్ణయిస్తుంది. దానిని మనం ఇప్పుడే చెప్పలేమని బాలాజీ వెల్లడించారు. ప్రస్తుతానికి, గత కొన్ని సంవత్సరాల మాదిరిగా కాకుండా ఈ ఏడాది కొంత అధిక ఉష్ణోగ్రతలు నెలకొనే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, కాప్రా, కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, సైదాబాద్‌లలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వాతావరణంలో గాలి కాలుష్యం కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది. దీంతో ఎల్ నినో,లా నినో ఏర్పడుతున్నాయి. కాలుష్యం కారణంగా రాబోయే దశాబ్ధ కాలంలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇదే జరిగితే అంటార్కిటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లోని మంచు కరిగి తీరంలోని సముద్రపు నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే కొన్ని దేశాలు ముంపు భారిన పడతాయని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Summer