Hyderabad Heavy Rain: హైదరాబాద్లో కుంభవృష్టి కురుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. దీంతో మరోసారి నగరం జలమయం అయిపోయింది. వారం రోజుల పాటు నీటిలో నరకం అనుభవించి ఇప్పుడిప్పుడే కొంచెం ఊరట పొందుతున్న నగర వాసులపై మరోసారి పంజా విసిరాడు వరుణుడు. రాత్రి 80.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్ శివారులోని బండ్లగూడలో అత్యధికంగా 119 మి.మీ వర్షపాతం నమోదైంది. పెద్ద అంబర్ పేట, సరూర్ నగర్, తాటి అన్నారం, కందికల్ గేట్, నాగోల్ రాక్ టౌన్ కాలనీ, వనస్థలిపురం ప్రశాంత్ నగర్ కాలనీ, ఉప్పల్ శాంతినగర్ కమ్యూనిటీ హాల్, గండిపేట్, ఉప్పల్, సైదాబాద్, ఖైరతాబాద్, షేక్ పేట్, బాలానగర్, ముషీరాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, చార్మినార్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.
హైదరాబాద్లో గత ఐదు గంటలుగా కొత్తపేట, చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, ఎల్బీనగర్, సరూర్ నగర్, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్ పల్లి, ప్రగతినగర్, జేఎన్టీయూ ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. భాగ్యనగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్, దాని చుట్టుపక్కల మొత్తం ప్రజలు వణికిపోతున్నారు.
మరోవైపు తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారం ఉదయం ఇది వాయుగుండంగా మారింది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.
ఇక శంషాబాద్ లో కుండపోత వర్షం కురవడంతో గగన్ పహడ్ వద్ద వరద నీరు భారీగా పారుతోంది. హైదరాబాద్ - బెంగుళూరు, బెంగుళూరు - హైదరాబాద్ ప్రయాణికులు ఔటర్ రోడ్డు నుంచి వెళ్ళాలని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి సూచనలు చేశారు. మరోవైపు హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చింతల్ కుంట వద్ద ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు వర్షంలో తడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ శాఖను అప్రమత్తం చేశారు డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి. భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణనష్టం జరగకుండా ప్రాధాన్యతనివ్వాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ ల తో గ్రేటర్ హైదరాబాద్ లో పరిస్థితులను సమీక్షించారు. ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని అన్ని స్థాయిల్లోని పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్ఎంసి తో పాటు, జిల్లాల్లో కలెక్టర్, వివిధ శాఖల తో కలసి సమన్వయంతో పనిచేయాలని కోరారు. లోతట్టు ప్రాంతాలు, చెరువు, కుంటల సమీపంలో స్థానికుల సహాయంతో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. రానున్న రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నందున అప్రమత్తతో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.