పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర హోం శాఖ గైడ్ లైన్స్ ను పాటించాలని కోర్టు సూచించింది. పరేడ్ ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించాలి. రేపటి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకలను నిర్వహించడం లేదని దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
లక్షల మందితో నిర్వహించే బహిరంగ సభలకు కోవిడ్ నిబంధనలు వర్తించవు. కానీ రిపబ్లిక్ డే వేడుకలకు మాత్రం ఈ నిబంధనలు వర్తిస్తాయా అని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. జాతీయ భావం పెంపొందించడానికి ఈ జాతీయ పండుగ జరుపుకుంటాం. అయితే గతంలో 2 ఏళ్లు కూడా కరోనా కారణంగా పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు జరగలేదని, ఈసారి రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు ఎక్కడ జరుపుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ తో కూడిన గణతంత్ర వేడుకలు జరపాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది.
2019లో తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై పబ్లిక్ గార్డెన్ లో జరిగిన 2020, 2021 గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అయితే కరోనా కారణంగా 2022లో మాత్రం గణతంత్ర వేడుకలు పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించడం లేదని ప్రభుత్వం గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్ కు సమాచారం ఇచ్చింది. అయితే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. అప్పటి నుంచి పెండింగ్ బిల్లులు సహా ఇతర అంశాలపై గవర్నర్ పై కేసీఆర్ అసహనంతో ఉన్నారు. దీనితో అటు గవర్నర్ రాజ్ భవన్ కు ఇటు కేసీఆర్ ప్రగతిభవన్ కు మధ్య దూరం బాగా పెరిగింది.
ఇక రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ గవర్నర్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో గవర్నర్ తీరును మంత్రులు, ప్రభుత్వ అధికారులు తప్పుబట్టారు. అయితే ఈసారి రిపబ్లిక్ డే వేడుకలపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో గతేడాది లాగే ఈసారి కూడా గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ లోనే నిర్వహించాలని ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Kcr, Telangana, Telangana High Court