ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈనెల 5న హైదరాబాద్‌కు (Hyderabad) రానున్నారు. పీఎం హైదరాబాద్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలతో పాటు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొననున్నారు. మొత్తంగా ప్రధాని పర్యటనను పరిశీలిస్తే.. ప్రధాని రేపు మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ క్యాంపస్‌కు చేరుకుంటారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను మోదీ ప్రారంభించనున్నారు. మొక్కల సంరక్షణపై ఇక్రిశాట్ వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయం, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన ఇక్రిశాట్ లోగోను మోదీ ఆవిష్కరిస్తారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయనున్నారు.
అనంతరం ప్రధాని మోదీ ముచ్చింతల్ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరనున్నారు. దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆయన ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకొని విశ్వక్ సేనుడి పూజ చేస్తారు. అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొంటారు.
216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోదీ.. చినజీయర్ స్వామితో కలిసి పూజ చేస్తారు. తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమివ్వనున్నారు. అనంతరం అక్కడి నుంచే మోదీ తన సందేశాన్ని ఇవ్వనున్నారు. మోదీ సమక్షంలోనే రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శిస్తారు.
మోదీ ముచ్చింతల్ ఆశ్రమం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణించే మార్గంలో పోలీసులు ఆంక్షలు అమలు చేయనున్నారు. ఆ రూట్లో మోదీ ప్రయాణించే సమయంలో ఎవరినీ అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ముచ్చింతల్ ఆశ్రమం నుంచి ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మోదీ ఢిల్లీ బయలుదేరి వెళతారు.
ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్..
పీఎం నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. సమతామూర్తి కేంద్రం, విగ్రహ పరిసరాలను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. పీఎం టూర్‌ను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును బ్లూబుక్ ప్రకారం అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. వీవీఐపీ పర్యటన సమయంలో కరోనా ప్రొటోకాల్స్ పాటించేలా చూడాలని హెల్త్సెక్రటరీని సీఎస్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే..
వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీ పీసీఆర్ కోవిడ్ టెస్టులు చేయాలన్నారు. పీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్‌బీ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలించాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా కూడా భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
పటిష్ట బందోబస్తు..
మోదీ పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 7వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు. ఇక్రిశాట్, ముచ్చింతల్ ఆశ్రమాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర పోలీసులతో ఎస్పీజీ అధికారులు సమన్వయం చేస్తున్నారు. ముచ్చింతల్ పరిసర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. శ్రీరామనగరంలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.