MLC Kalvakuntla Kavitha: సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత సుప్రీంను ఆశ్రయించారు. ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో విచారించడంపై అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ వాదనలు వినాలని ఈడీ కూడా కేవియట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనితో నేడు సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఇరు వర్గాల వాదనలను విననుంది. అయితే వాదనలు విననున్న ఇవాళ సుప్రీం ఏదైనా తీర్పు ఇస్తుందా? లేక విచారణ వాయిదా వేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. కాగా ఈనెల 24న కవిత పిటీషన్ పై విచారణ జరగాల్సి ఉండగా..27 జాబితాలో విచారించాలని సుప్రీం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే 3 సార్లు విచారించారు. మొదటగా ఆమెకు ఈనెల 11న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కవిత ఆరోజు విచారణకు హాజరు అయ్యారు. సుమారు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. అయితే ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో రాత్రి వరకు విచారించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈడీ అధికారులు నిబంధనలకు లోబడి విచారణ జరపడం లేదని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈనెల 24న విచారణ జరుపుతామని పేర్కొంది.
అయితే 11న కవితను విచారించిన అధికారులు 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టులో పిటీషన్ ఉన్న కారణంగా ఆ తీర్పు వచ్చే వరకు విచారణకు రాలేనని కవిత తన ప్రతినిధి ద్వారా ఈడీకి సమాచారం అందించారు. ఆరోజు నెలకొన్న హైడ్రామాతో విచారణ జరగలేదు. అయితే ఈనెల 20న విచారణకు రావాలని కవితకు మూడోసారి నోటీసులు ఇచ్చారు. దీనితో ఆమె విచారణకు హాజరు కాక తప్పలేదు. ఆ మరుసటి రోజు కూడా విచారణకు రావాలని చెప్పగా..21న కూడా కవిత విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 రోజుల పాటు 30 గంటలు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది.
మరోవైపు ఈరోజు విచారణ అనంతరం సుప్రీం ఏదైనా తీర్పు ఇస్తుందా? ఆ తీర్పు కవితకు అనుకూలంగా ఉంటుందా? లేక ఈడీకి అనుకూలంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే సుప్రీం తీర్పును బట్టి కవిత ఈడీ విచారణపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Hyderabad, Kalvakuntla Kavitha, Supreme Court, Telangana